సాక్షి, ముంబై: నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చెయ్యించాలంటే మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(మాడా)కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాన్సిట్ క్యాంపుల్లో తగినన్ని ఇళ్లు ఖాళీగా లేకపోవడంతో అక్కడకు వెళ్లేందుకు అనేక మంది నిరాకరిస్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగరంలో గత కొన్నిరోజులుగా పాత భవనాలు పేకమేడల్లా కూలుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే వాటిల్లుతోంది. నగరంలో వందలాది భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు సాధమైనంత త్వరగా వాటిని ఖాళీ చేయించాలని మాడా, బీఎంసీలను ప్రభుత్వం అదేశించింది. అయితే ప్రమాదకర భవనాల్లో నివాసముంటున్న సదరు వేలాది కుటుంబాలకు పునరావాసం ఎక్కడ కల్పించాలనేది అధికారులకు సమస్యగా మారింది. ఇందుకోసం మాడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.
నగరంలో మూత పడిన మిల్లు స్థలాల్లో మాడా వాటాలోకి వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న, నిర్మించనున్న భవనాల్లో ట్రాన్సిట్ క్యాంపుల కోసం కొన్ని ఇళ్లను కేటాయించింది. ఇటీవల కాళా చౌకి ప్రాంతంలో ఓ మిల్లు స్థలంలో మాడా దాదాపు 10 వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో 6,925 ఇళ్లు మిల్లు కార్మికులకు కేటాయించగా, మిగతా 3,075 ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపుల కోసం కేటాయించింది. అయితే ముంబైలో 15 మిల్లులకు చెందిన 62,507 చదరపు మీటర్ల స్థలం కార్మికులకు ఇళ్లు నిర్మించేందుకు మాడా ఆధీనంలో ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపడితే కార్మికులకు ఇళ్లు లభించడంతోపాటు ట్రాన్సిట్ క్యాంపుల కోసం 3,283 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. అందుకు ప్రభుత్వం, మాడా సమన్వయంతో సకాలంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇళ్లు మాడా ఆధీనంలో ఉంటే అత్యవసర సమయంలో బాధితులకు పునరావాసం కల్పించడానికి ఎంతో దోహదపడతాయి. అయితే ఇప్పుడు మాడా వద్ద ఇళ్లు ఖాళీ లేకపోవడంతో పురాతన భవనవాసుల తరలింపు తలనొప్పిగా మారింది.
ట్రాన్సిట్ క్యాంపుల భవనాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలం వెతకాల్సిన పని లేదని,అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లోనే ఇళ్లు నిర్మిస్తే చాలు పునరావాస సమస్య పరిష్కరమవుతుందని మాడా గృహనిర్మాణ శాఖ అధికారులు అంటున్నారు. ఇవి అందుబాటులోకి రావాలంటే ముందు మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించాలి. వాటిని కార్మికులకు చౌక ధరకు విక్రయించాలి. వీటి ద్వారా వచ్చే నిధులతో ట్రాన్సిట్ క్యాంపు భవనాలు నిర్మించేందుకు సాధ్యపడుతుందని ఓ అధికారి వెల్లడించారు. నగరం, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో సుమారు 58 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడడంతో నియమాల ప్రకారం మిల్లు స్థలాన్ని మూడు భాగాలు చే యాలి. ఇందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం ప్రభుత్వానికి, మూడో భాగం మాడాకు అందజేయాల్సి ఉంటుంది. మాడా వాటాలోకి వచ్చిన మొత్తం స్థలంలో కార్మికుల ఇళ్లకు పోనూ మిగతా స్థలంలో మాడా తమ ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుంది. ఇలా నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం కాళాచౌకిలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా మిల్లు స్థలాలు మాడా అధీనంలోకి వస్తే ఇక్కడ వేలాది ఇళ్లు నిర్మించి పునరావాస గృహాలుగా వినియోగించుకునేందుకు వీలు కలగనుంది.
పునరావాస పాట్లు
Published Tue, Oct 22 2013 11:38 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement