మాధురిలో నేనే కనిపించా!
మాధురిలో నేనే కనిపించా!
Published Sun, Mar 9 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
న్యూఢిల్లీ: గులాబ్ గ్యాంగ్ సినిమా నిర్మాతలపై సామాజిక కార్యకర్త సంపత్‌పాల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నా మాధురీదీక్షిత్ నటన మాత్రం ఆమెను ముగ్ధురాలిని చేసినట్లే కనిపిస్తోంది. ‘గులాబ్ గ్యాంగ్ సినిమా నిర్మాతలు నా జీవితాన్నే చిత్రంగా మలిచినట్లు అనిపించింది ఈ సినిమా చూస్తుంటే.. అందుకే వారితో యుద్ధానికి సిద్ధమయ్యాను. నా డిమాండ్లు నెరవేరేవరకు ఈ పోరాటం ఆగదు. అయితే మాధురీ దీక్షిత్ తన నటనతో నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ పాత్రలో మాధురిని తెరపై చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది..’ అని గులాబ్ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు సంపత్‌పాల్ పేర్కొన్నారు. ‘ఆమె నటన చూస్తే నా పోరాట ప్రయాణంలో నాకు ఎదురైన అనుభవాలను నెమరవేసుకున్నట్లే అనిపించింది.. నేనే తెరపై ఉన్నానేమోననేంతగా ఆమె నటన ను చూసి పరవశురాలయ్యాను.. ఈ సినిమాలో పాత్రధారులు, నటులపై నాకు ఎటువంటి కోపం లేదు..
అనుభవ్ సిన్హా సహా మిగతా నిర్మాతలపైనే నా పోరాటం..’ అని ఆమె తెలిపారు. ఆ సినిమా తీసే ముందు తన అనుమతి తీసుకోలేదని, తనప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు పాల్ జీవితానికి గాని, ఆమె స్థాపించిన సంఘాన్ని కాని ఉద్దేశించి తీసినవి కావని, కేవలం కల్పితాలని ప్రకటించాలన్న షరతుతో సినిమా విడుదలకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కాగా, పాల్ శుక్రవారం తన న్యాయవాదితో సహా ఈ సినిమాను చూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సినిమా తన జీవితచరిత్రను ఆధారంగానే తీశారన్నారు. తన జీవితంపై రచయిత్రి అమనా ఫొంటెల్లా ఖాన్ రచించిన ‘పింక్ శారీ రివల్యూషన్’ పుస్తకం ఆధారంగానే తీశారు.
ఆ సినిమాలో ఉన్న అన్ని సన్నివేశాలు నా నిజజీవితంలో జరిగినవే.. ఆ పుస్తకంలో పేర్కొన్నవే.. కాని సినిమా నిర్మాతలు ఈ విషయాన్ని ఒప్పుకోవడంలేదు.. వారు అబద్ధాలు చెబుతున్నారు..’ అని పాల్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాకు టైటిళ్లకు ముందు ప్రదర్శించే హెచ్చరికలో ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలని ప్రకటించినంత మాత్రాన అవి కల్పితాలు కావు కదా అని ఆమె వాదించారు. నేను ఇక్కడే ఉన్నాను.. మాధురి పోషించిన పాత్ర ‘రజ్జో’ చూస్తే అది కల్పితమని ఎలా చెప్పగలుగుతారో..’ అని ఆమె ప్రశ్నించారు. ‘మహిళా హింసకు వ్యతిరేకంగా నేను ఎలా పోరాడాను.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంపై సీఎంను ఎలా కలిశాను..
ఎలా జైలుకు వెళ్లాను.. చిత్రకూట్ జిల్లా మానిక్‌పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా టికెట్ పొందాను.. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.. కాదని ఆ నిర్మాతలు ఎలా బుకాయిస్తారు..!? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్‌పాల్ పూర్వాశ్రమంలో ఆరోగ్యశాఖలో పనిచేశారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో బాల్యవివాహాలు, మహిళా హింసకు వ్యతిరేకంగా 2006లో ఆమె ‘పింక్ శారీ రివల్యూషన్’ను ప్రారంభించారు. అనేక ఉద్యమాలు నిర్వహించారు.
Advertisement
Advertisement