పేలుడుకు కుట్ర!
Published Wed, Feb 12 2014 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 4:05 PM
సాక్షి, చెన్నై: మదురైలో పేలుడుకు సంఘ విద్రోహ శక్తులు చేసిన కుట్ర భగ్నం అయింది. ఓ షాపింగ్‌మాల్‌లో అమర్చిన పైప్ బాంబును మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. నగరంలో నిఘాను మరింత పటిష్టం చేశారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంపై సంఘ విద్రోహ శక్తులు గురి పెట్టినట్టుగా ఇటీవల కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ చర్యలు చేపట్టారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై డేగ కన్నువేశారు. అయినప్పటికీ పేలుడుకు కుట్ర పన్ని మంగళవారం నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్ వెనుక పైప్ బాంబు అమర్చి ఉండడం వెలుగులోకి వచ్చింది. పైప్ బాంబుకు టైమర్ అమర్చి ఉండడంతో అందులో నుంచి వస్తున్న శబ్దాన్ని అక్కడి సిబ్బంది గుర్తిం చారు. తక్షణం పోలీసులకు సమాచారం అందించారు.
ఆ బాంబును స్వాధీనం చేసుకున్న నగర పోలీసులు వైగై నదిలోకి తీసుకెళ్లారు. దానిని నిర్వీర్యం చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే, ఆ బాంబు షాపింగ్ మాల్ వద్దకు ఎలా వచ్చిందో విచారణ జరుపుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఇంటి వద్ద లభించిన తరహాలోనే ఈ పైప్ బాంబు ఉండటంతో పోలీసుల్ని కలవరంలో పడేస్తోంది. ఈ పైప్ బాంబు పేలి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకుని ఉండేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పైపు బాంబు ద్వారా నగరంలో పేలుడుకు కుట్ర జరిగిన సమాచారం అక్కడి ప్రజల్లో కలకలానికి దారి తీసింది. దీంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మీనాక్షి అమ్మవారి ఆలయం, బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటుగా ముఖ్య ప్రదేశాల్లో భద్రతను ఏడంచెలకు పెంచారు. ఈ పైప్ బాంబును అమర్చి పేలుడుకు కుట్ర చేసిన సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకోవడం లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఉన్నాయి.
Advertisement