‘ఏవోబీ ఘటనపై జుడీషియల్ విచారణ జరపాలి’
శంషాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర పది రోజులుగా కొనసాగుతోంది. యాత్ర గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు.
మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్ బూటకమని, ఆ ఘటనపై జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, హింసకు ప్రతీకారం ప్రతిహింస కారాదన్నారు. ప్రజా సమస్యలు ఉద్యమాలతోనే పరిష్కారం కావాలని అన్నారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యం కల్పించటం లేదని విమర్శించారు. వీటన్నిటిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తాము పాదయాత్ర చేపట్టామని చెప్పారు. ఇందులో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.