నాసిక్: జలాశయాల నుంచి నీటి విడుదల విషయంలో మహారాష్ట్ర పొరుగు రాష్ట్రాలతోనేకాదు సొంత రాష్ట్రంలోనే సమస్యలను ఎదుర్కొంటోంది. నాసిక్ జిల్లాలోని జలాశయాల నుంచి మరాఠ్వాడాకు నీటిని విడుదల చేస్తామంటూ జలవనరులశాఖ మంత్రి సునీల్ తట్కరే ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేతలేగాకుండా సొంత పార్టీ ఎన్సీపీ నుంచే తట్కరే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెన్నెస్ నేతల నుంచి హెచ్చరికల రూపంలో ప్రతిఘటనలు ఎదురవుతుండగా ఛగన్ భుజ్‌బల్‌కు సన్నిహితులుగా చెప్పుకునే ఎన్సీపీ నేతలు కూడా తట్కరే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటీవల ఔరంగాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తట్కరే మరాఠ్వాడాలోని జయక్‌వాడి జలాశయానికి నాసిక్ జిల్లాలోని జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే నాసిక్ జిల్లాలోని జలాశయాల నుంచి ఒక్క బొట్టు నీటిని కూడా జయక్‌వాడి డ్యాంకు మళ్లించనీయబోమని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.
‘ఒక్క బొట్టు నీటిని కూడా నాసిక్ జలాశయాల నుంచి జయక్‌వాడి డ్యాంకు మళ్లించనీయం. ఒకవేళ అలా జరిగితే ఎంతకైనా తెగిస్తామ’ని ఎన్సీపీ ఎమ్మెల్సీ జయంత్ జాదవ్ గురువారం హెచ్చరించారు. అక్రమంగా నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని ఎన్సీపీకి చెందిన మరో నేత ప్రకటించారు. జిల్లాలోని జలాశయాలు ఎండిపోతుంటూ ఎలా చూస్తూ ఊరుకుంటామని ప్రశ్నించారు. ఇక ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌రావ్ ధిక్లే మాట్లాడుతూ... ‘నీటి తరలింపు విషయంలో మా అభిప్రాయాలను పక్కనబెడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు సకాలంలో రావడంతో ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగానే కురిశాయి. జయక్‌వాడి జలాశయంలో కూడా సరిపడినంత నీటి నిల్వలున్నాయి. అయినప్పటికీ నాసిక్ జిల్లాలోని జలాశయాల నుంచి తరలించాల్సిన అవసరమేముంది? జిల్లాలో రెండు భారీ పరిశ్రమల కారిడార్‌లు ఉన్నాయి. వాటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది. ఉన్న నీటిని పక్క జిల్లాలకు తరలిస్తే ఆ పరిశ్రమలు మూతపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ పరిశ్రమల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ నీటిని మళ్లించడానికి ప్రయత్నించడం న్యాయమనిపించుకోదు. దీనిని ఎమ్మెన్నెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళ్లాలనుకుంటే మా నుంచి ప్రతిఘటన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల’ని హెచ్చరించారు. ఇదిలాఉండగా సునీల్ తట్కరే చేసిన వ్యాఖ్యలపై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నవంబర్ 2న అఖిలపక్ష భేటి జరుగనుంది. జిల్లాలోని గంగాపూర్, దార్నా జలాశయాలు 99 శాతం నిండాయి. మిగతా జలాశయాల్లో కూడా దాదాపుగా సరిపడా నీటి నిల్వలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరాఠ్వాడకు ప్రాణాధారంగా భావించే జయక్‌వాడి జలాశయానికి నీటిని తరలించేందుకు జిల్లా నేతలు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంలో శనివారం ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ విషయమై జిల్లాకు చెందిన ఎన్సీపీ నేత ఒకరు మాట్లాడుతూ... ‘ఈ విషయంలో పార్టీని, ప్రభుత్వాన్ని పక్కనపెట్టి జిల్లా వాసుల ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామ’న్నారు.
నీటి దుమారం
Published Thu, Oct 31 2013 11:37 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement