ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Maharashtra Legislature Budget session | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published Mon, Mar 9 2015 10:44 PM | Last Updated on Tue, Aug 21 2018 12:00 PM

Maharashtra Legislature Budget session

సాక్షి, ముంబై: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ ప్రసంగించారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం మద్దతు కోసం వేచి చూడకుండా రూ. నాలుగు వేల కోట్ల ఇందుకోసం కేటాస్తామన్నారు.

కరవు పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రం శాశ్వత పరిష్కారాలు ఎంచుకుందని, ఇందుకోసం ‘జల్‌యుక్త్ శివార్’ యోజన పథకాన్ని చేపడుతున్నామని, 2019 తర్వాత కరవు ప్రాంతం ఉండదన్నారు. మైక్రో నీటి పారుదలకు ప్రాధాన్యం ఇస్తామని, తద్వారా సాగుక్షేత్రం పెరుగుతుందన్నారు. ప్రతి ఏటా సుమారు అయిదు వేల గ్రామాలకు కరవు నుంచి విముక్తి కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా 2015-16లో గ్రామీణ ప్రాంతాల్లో 14.15 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ. 450 కో ట్ల రుణం తీసుకుంటామన్నారు.
 
1200 ఎకారల్లో టెక్స్‌టైల్ హబ్
అయిదు లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించే విషయమై పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అమరావతి నాంద్‌గావ్ పేట్‌లో 1200 ఎకరాల స్థలంలో టెక్స్‌టైల్ హబ్ నిర్మిస్తామన్నారు. మరాఠీ భాష భవనం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం నిర్మాణం కోసం ఇందు మిల్లు స్థలాన్ని కేంద్రం నుంచి పొందేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామన్నారు.

లండన్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసాన్ని అంతర్జాతీయ స్మారకంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దివంగత ప్రజా నాయకుడు గోపీనాథ్ ముండేకు ఔరంగాబాద్‌లో, రాజ్‌మాతా జిజావు స్మారకాన్ని ఆమె జన్మస్థలం సిందఖేడ్ రాజాలో స్మారకాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసి చుట్టుపక్కల 600 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో ‘నైనా’ పేరుతో అత్యాధునిక నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. పుణే, ముంబైలలో సీసీటీవీ కెమెరాలను అమర్చే పనులు జరుగుతున్నాయని, ముంబైలో 90 వారాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం పూర్తవుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement