అసెంబ్లీలో సీఎం ఫడ్నవిస్
నాగపూర్: మహారాష్ట్ర నుంచి ముంబై మహానగరాన్ని ఎవరూ ఎప్పటికీ విడదీయలేరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై సోమవారం సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నగరం త్వరితంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే తాను ప్రధాని నేతృత్వంలో ముంబై కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని సూచించానే తప్ప వేరే ఉద్దేశమేదీ లేదని వివరించారు. ఏ శక్తీ రాష్ట్రం నుంచి ముంబైని వేరుచేయలేదని ఆయన ఉద్ఘాటించారు. రైల్వే, గృహ నిర్మాణ తదితర శాఖలకు చెందిన ఫైళ్లతో పాటు నగరానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఒకవేళ ప్రధాని నేతృత్వంలో కమిటీ ఏర్పడితే, వీటి అనుమతులు శీఘ్రగతిలో లభించే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని రోజుల కిందట సీఎం మాట్లాడుతూ.. ‘ముంబై దేశ ఆర్థిక రాజధాని.. ఈ నగరం అభివృద్ధి కుంటిపడితే, దేశాభివృద్ధి కుంటుపడినట్లే. ప్రస్తుతం నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర సంస్థల మధ్య సమన్వయం సాధించడం అవసరం. ఈ నేపథ్యంలో ముంబై అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ముంబై అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేయడం ఎంతైనా అవసరం..’ అని అన్న విషయం తెలిసిందే.ఇదిలాఉండగా, బీఎంసీలో పనిచేస్తున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి గృహ నిర్మాణ పథకం అమలు చేసేందుకు యోచిస్తున్నామని సీఎం ఫడ్నవిస్ తెలిపారు. అలాగే సెక్రటేరియట్ స్థాయి అధికారుల వద్ద నుంచి అధికారాల వికేంద్రీకరణ చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.
ఫిబ్రవరి 19న శివాజీ మెమోరియల్‌కు భూమిపూజ..
ముంబై తీరంలో నిర్మించతలపెట్టిన శివాజీ స్మారకానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భూమిపూజ నిర్వహించనున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ స్మారక నిర్మాణానికి సంబంధించి ఎన్నో యేళ్లుగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అనుమతులు సాధిస్తామని చెప్పారు. అలాగే ముంబైలోని ఇందూ మిల్స్‌లో అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత డీఎఫ్ ప్రభుత్వం దీనికోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ, అనుమతులు సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
అలాగే కోస్టల్ రోడ్ సాధించడంలోనూ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఫైళ్లకూ అనుమతులు సాధించేందుకు కృషిచేస్తుందని హామీ ఇచ్చారు. పుణేను రాష్ట్ర ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని వివరించారు. అలాగే వివిధ నగరాల్లో నీటి సమస్య పరిష్కారానికి కూడా త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు.
ముంబై ఎప్పటికీ ‘మహా’భాగమే
Published Mon, Dec 15 2014 10:07 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement