కాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో హతమైన మిలిటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇంటికి సైనిక భద్రత కల్పించారు. ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్
టీనగర్, న్యూస్‌లైన్:కాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో హతమైన మిలిటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇంటికి సైనిక భద్రత కల్పించారు. ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్ కాలనీ పార్క్‌వ్యూ అపార్టుమెంట్స్‌లో ముకుంద్ కుటుంబం నివసిస్తోంది. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వరదరాజన్ కుమారుడు ముకుంద్ వరదరాజన్(32). ఈయన ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. ఈయన భార్య ఇందు, కుమార్తె హర్షియ(3)తో బెంగళూరులోని మిలటరీ క్వార్టర్స్‌లో నివసించేవారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం కాశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పుల్లో ముకుంద్ వరదరాజన్ అమరుడయ్యూరు. ముకుంద్ వరదరాజన్ మృతదేహం చెన్నైలోని ఆయన ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ముకుంద్ తల్లి కేరళకు చెందిన మహిళ. ఆమె కుటుంబ స్నేహితుడైన కేరళ సీఎం ఉమెన్‌చాండీ ముకుంద్ తల్లిదండ్రులను, అతని భార్యను ఓదార్చారు. ప్రస్తుతం ముకుంద్ ఇంటికి భద్రతగా ఇద్దరు జవాన్లను నియమించారు. వీరు బయటి వ్యక్తులను ఎవ్వరినీ ఇంటిలోకి అనుమతించడం లేదు.