ఇద్దరు భార్యలున్నా మరో యువతితో..
ప్రేమ వ్యవహారం
= కారు డ్రైవర్‌ను చితకబాదిన ప్రియురాలి బంధువులు
బెంగళూరు(బనశంకరి) : ఇద్దరు భార్యలున్నా మరో యువతిని ప్రేమలోకి దించిన కారు డ్రైవర్‌ను ప్రియురాలి బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. కగ్గలిపురకు చెందిన వజ్రేశ్ కారుడ్రైవరుగా పనిచేస్తున్నాడు. దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన శశికళా అనే యువతిని వివాహం చేసుకుని రాజరాజేశ్వరినగరలో నివాసముంటున్నారు. అనంతరం మొదటి భార్యకు తెలియకుండా హొసకోటే తాలూకాకు చెందిన రూపా అనే యువతిని వివాహం చేసుకుని జ్ఞానభారతిపోలీస్‌స్టేషన్ పరిధిలోని బీడీఏ కాంప్లెక్స్ సమీపంలో అద్దె ఇంటిలో ఉంచాడు.
ఇటీవల కగ్గలిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. తనను పెళ్లిచేసుకోవాలని కోరడంతో కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. రెండు చోట్ల కాపురాలు చేయడంతో ఖర్చు అధికమైన వజ్రేశ్ శశికళాను రూపా వద్దకు తీసుకెళ్లగా రెండు వివాహాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మరో యువతిని కూడా ప్రేమించినట్లు తెలియడంతో రూపా, శశికళలు శుక్రవారం ఉదయం వజ్రేశ్‌తో గొడవ పడ్డారు. విషయం ప్రేయసికి తెలియడంతో ఆమె తరఫు బంధువులు అక్కడకు చేరుకొని వజ్రేశ్‌ను చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వజ్రేశ్ ను అదుపులోకి విచారణ చేపట్టారు.