తిరువొత్తియూరు: ఇండోనేషియా నుంచి దుబాయ్‌కి వెళుతున్న విమానంలో గుండెపోటుతో పారిశ్రామికవేత్త మృతి చెందాడు. ఇండోనేషియా నుంచి దుబాయ్‌కి బుధవారం రాత్రి విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న ఇండోనేషియాకు చెందిన పారిశ్రామికవేత్త అవతీష్‌భాను (55)కు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. దీంతో ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపాడు. సదరు విమానం చెన్నై సమీపంలో ఉండటం చేత ఎయిర్ పోర్టు అధికారులతో పైలట్లు సంప్రదించారు.
చెన్నై ఎయిర్ పోర్టులో విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో చెన్నై ఎయిర్ పోర్టులో రాత్రి 9గంటలకు అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న డాక్టర్లు అవతీష్‌భాను ఆరోగ్యాన్ని పరిశీలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. అవతీష్ భాను మృతదేహాన్ని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటలకు విమానం తిరిగి దుబాయ్‌కి బయలుదేరింది.