అమ్మకు ఎయిమ్స్ వైద్యం
ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్స నిమిత్తం ఢిల్లీ నుంచి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వైద్య బృందం గురువారం చెన్నైకి చేరుకుంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యానికి గురై అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 23వ తేదీ తెల్లవారుజామున అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్ వల్ల ఆమె బాధపడుతున్నారని అపోలో వైద్యులు అదే రోజున బులెటిన్ విడుదల చేశారు. గత 15 రోజులుగా ఆమెకు చికిత్స జరుగుతోంది. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ అనే వైద్య నిపుణుడు జయకు ఊపిరితిత్తుల్లో శస్త్రచికిత్సను చేసినట్లు తెలుస్తోంది. ఆమె బాగా కోలుకున్న దశలో డాక్టర్ రిచర్డ్ లండన్‌కు వెళ్లిపోయారు.
సీఎంకు కొద్దిగా ఇన్‌ఫెక్షన్ సోకినందున చికిత్స తీసుకుంటూ బాగా కోలుకుంటున్నారని అపోలో వైద్యులు ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించినట్లు వైద్యులు చెప్పారు. డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం జయ ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణలో ఉంది. ఇదిలా ఉండగా, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం బుధవారం రాత్రి అపోలోకు చేరుకుంది. ఊపిరి తిత్తుల చికిత్స నిపుణుడు డాక్టర్ గిల్మా నీ, అనస్థీషియా నిపుణుడు ప్రొఫెసర్ అంజన్ డిరిక్కా, హృద్రోగ నిపుణుడు డాక్టర్ నితీష్‌నాయక్ తదితరులతో కూడి న వైద్య బృందం అపోలో వైద్యులతో సమావేశమయ్యారు. జయలలితకు ఇంతవరకు జరిగిన వైద్యం గురించి వివరాలు సేకరించారు.
ఇకపై చేయాల్సిన చికిత్స గురించి రాత్రి 10 నుంచి 12.30 గంటల వరకు రెండున్నర గంటల పాటూ సమాలోచనలు జరిపారు. ఇకపై సాగాల్సిన వైద్యం గురించి నిర్ణయం తీసుకున్నారు. అమ్మ కోలుకోవాలని వేడుకుంటూ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.‘ట్రాఫిక్’ రామస్వామి పిటిషన్ కొట్టివేత: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యస్థితిపై ఒక ప్రకటన విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘ట్రాఫిక్’ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు గురువారం కొట్టివేసింది.
పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు, ఆసుపత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నారు, కావేరీ వివాదంపై కూడా అధికారులతో చర్చించారు...అంటూ అన్నాడీఎంకే శ్రేణులు కొన్నిరోజులుగా చెబుతున్నారు. అపోలో ఆసుపత్రి నుండి అప్పుడప్పుడు జయ ఆరోగ్యంపై బులెటిన్లు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అమ్మ ఆరోగ్యంపై వాస్తవాల కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఒక స్పష్టమైన నివేదికను ప్రకటించేలా, ఆసుపత్రిలో ఉన్న సీఎం ఫొటోను విడుదల చేసేలా ఆదేశించాలని ట్రాఫిక్ రామస్వామి తన పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు.
ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, అనారోగ్యం సీఎం జయలలిత వ్యక్తిగత విషయమని, ఆమె ఆంతరంగిక విషయాలపై హైకోర్టులో నివేదిక సమర్పించడం తగనిపని అంటూ వాదించారు. ముఖ్యమంత్రి ప్రజాబాహుళ్యంలో ఉన్నందున ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ప్రజల్లో ఆతృత ఉండడం సహజం, ప్రభుత్వం ఎందుకు ఒక ప్రకటన చేయకూడదని పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంప్రదించి చెబుతానని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. ఇదిలా ఉండగా రామస్వామి వేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ , న్యాయమూర్తి మహాదేవన్ ల ముందుకు గురువారం విచారణకు వచ్చింది.
ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిన అనంతరం న్యాయమూర్తులు ఇద్దరూ ట్రాఫిక్ రామస్వామిని సున్నితంగా మందలించారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఫొటో, వీడియో ఆధారాలు చూపించాలని ఎలా ఆదేశించగలమని అన్నారు. రాజకీయాలకు మద్రాసు హైకోర్టును వేదికగా వాడుకోరాదని హితవు పలికారు. ఇది ప్రజా ప్రయోజన వాజ్యం పరిధిలోకి రాదని, ప్రచారం కోసమే ఈ పిటిషన్ వే సినట్లుగా భావిస్తూ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.