తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పదేళ్ల పాటు కట్టెలు కొట్టే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న పది మందికి సబ్ కలెక్టర్, ఆర్డీవో అభిరామి ఆదివారం విముక్తి కల్పించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని ఉట్‌కోట్టం ప్రాంతానికి చెందిన కుమార్(45) అదే ప్రాంతంలో కట్టెల దొడ్డిని నిర్వహిస్తున్నాడు. ఇతను కడంబత్తూరు ప్రాంతంలోని అదిగత్తూరు ప్రాంతానికి చెందిన పది మందితో పదేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. తమకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ బాధితులు ఆదివాసి సంక్షేమ సంఘం ప్రతినిధులను ఆశ్రయించారు. సంఘం ప్రతినిధులు తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి రహస్య సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం కట్టెల దొడ్డిపై ఆమె తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరి చేస్తున్న పది మంది కి విముక్తి కల్పించారు. అనంతరం కుమార్‌పై కేసు నమోదు చేశారు. పది మంది బాధితులకు తాత్కాలిక సహాయం కింద రూ.1000 అందజేశారు. స్వయం ఉపాధి చేసుకోవడానికి రూ.25 వేల చొప్పున అందజేస్తామని ఆర్డీవో అభిరామి వివరించారు.