విజయ్ ఆంటోనీతో మియాజార్జ్
ఒక చిత్రం అపజయం పాలైతే ఇక ఆ చిత్ర హీరోయిన్‌కు అవకాశాలు అంతే అన్నది పాత మాట. టాలెంట్‌తో పాటు అదృష్టం కలిసొస్తే వచ్చే అవకాశాలను ఆపడం ఎవరితరం కాదన్నది ఇప్పటి మాట. ఇక కేరళ కుట్టీలకు బాగా అచ్చొచ్చిన పరిశ్రమ కోలీవుడ్. ఇక్కడ వారి హవానే రాజ్యమేలుతోంది. అమరకావ్యం చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన నటి మియాజార్జ్. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఇక మాలీవుడ్‌కు మూటాముల్లె సర్దుకోవాల్సిందే అనే ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు.
మియాజార్జ్‌ను కోలీవుడ్ వదులు కోవడానికి ఇష్టపడడంలేదు. అవకాశాలు ఆమెను వరిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఇండ్రు నేట్రు నాళై చిత్రంతో విజయాన్ని చవి చూసిన మియాజార్జ్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. వాటిలో ఒరునాళ్ కూత్తు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక శశికుమార్‌తో వెట్ట్రివేల్ చిత్రంతో పాటు యమన్ అనే చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. విజయ్ 60వ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని మియాజార్జ్‌నే స్పష్టం చేశారు.
అయితే తాజాగా విజయ్‌ఆంటోనీతో జత కట్టే అవకాశం వరించింది. దీనికి జీవా శంకర్ దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే ఆయన ఇంతకు ముందు విజయ్‌ఆంటోని హీరోగా నాన్ చిత్రానికి, మియాజార్జ్ హీరోయిన్‌గా అమరకావ్యం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లుగా చిత్రం చేయనున్నారు. ఇది తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నారాయన. మంచి కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 75 రోజుల్లో ఏకధాటిగా చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.