మొదటి అవకాశంతోనే స్టార్ అయినవారు కొందరైతే, అవకాశాలు మెండుగా ఉన్నా సరైన గుర్తింపు లభించని యాక్టర్స్ ఇంకొందరు. అలాంటి వారిలో మియా జార్జ్ ఒకరు. దశాబ్దంగా వెండితెర, బుల్లితెర మీద కనిపిస్తూనే ఉంది. కానీ, వావ్ అనుకునే భూమిక ఎక్కడా దక్కలేదు. ఆ అసంతృప్తితోనే వెబ్ దునియాలోకి అడుగుపెట్టింది. ఆ వేళావిశేషమేమో మరి.. మంచి పాత్రలతో తను కోరుకున్న గుర్తింపు పొందుతోంది!
మియా జార్జ్ స్వస్థలం కేరళలోని కోచ్చి. ఇంగ్లిష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్యాడ్యుయేషన్ చేసింది. టీచర్ అవుదామనుకుంది. కాని విధి ఆమెను ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ వైపు నడిపించింది.
టెలివిజన్ నటిగా ప్రయాణం ప్రారంభించింది. ఆమె తొలి సీరియల్ ‘ఒరు స్మాల్ ఫ్యామిలీ’. తర్వాత ‘డాక్టర్ లవ్’, ‘కళాత్తు’, ‘ద గ్రేట్ ఫాదర్’ వంటి చిన్న చిన్న టీవీ షోలు, సీరియల్స్‌లో నటించింది. మోడలింగ్‌లోకీ అడుగుపెట్టింది. అందాలపోటీల్లోనూ పాల్గొని ‘మిస్ కేరళ ఫిట్‌నెస్ (2012 )’ అవార్డ్‌నూ గెలుచుకుంది.
టీవీ సీరియల్స్ మియాకు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీనిచ్చాయి.. ‘అమర కావ్యం’ అనే చిత్రంతో! అయితే, ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ అవక ఆమెను నిరాశపరచింది. తర్వాత తెలుగులో సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’లో నటించింది. అదీ అంతే, ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని, ‘ఇండ్రు నేట్రు నాళై’ అనే తమిళ మూవీతో తిరిగొచ్చింది. అది కమర్షియల్‌గా సక్సెస్ అయింది. వెంట వెంటనే ‘రెడ్ వైన్’, ‘మెమరీస్’, ‘కోబ్రా’, ‘ పెళ్లి రోజు’, ‘యమన్’ లాంటి పలు మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది మియా.
ఆమె టాలెంట్‌కి వెబ్ దునియా వెల్‌కమ్ చెప్పింది. టీవీ, సినిమా రంగాల్లో రాని గుర్తింపును వెబ్ సిరీస్ ద్వారా అందుకుంటోంది. ఆమె నటించిన ‘జై మహేంద్రన్’ అనే సిరీస్ సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మధ్యనే వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌ను వివాహం చేసుకొని, ఫ్యామిలీ లైఫ్‌నీ స్టార్ట్ చేసింది మియా జార్జ్.
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతున్నా చెప్పుకోదగ్గ రోల్ ఒక్కటీ రాలేదు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రేదైనా ఒక్కటొస్తే చాలు అనుకుంటున్నా, అందుకే, ఫ్లాట్‌ఫామ్ గురించి ఆలోచించట్లేదు. టీవీ, సినిమా, ఓటీటీ.. ఏదైనా సరే, చేయబోయే పాత్రే ముఖ్యమని.. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.
– మియా జార్జ్
Comments
Please login to add a commentAdd a comment