విలక్షణ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హిసాబ్ బరాబర్’. నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేస్తే .. అతనెలా స్పందించాడు? న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఆర్థిక మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ నిర్మించాయి. దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ .. సమాజంలో అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన ‘హిసాబ్ బరాబర్’ అందర్నీ ఆలోచింపజేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నారు.
ఆర్.మాధవన్ మాట్లాడుతూ.. జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం ఎంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మనలో ఉండే కామన్‌మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. ఇలాంటి వాస్తవ కథనాలతో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నీల్ నితిన్ మాట్లాడుతూ.. హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్‌గా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది. మాధవన్ వంటి నటుడితో కలిసి యాక్ట్ చేయడం చాలా సంతోషం. తనొక అద్భుమైన వ్యక్తి. స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అన్నారు.
కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధవన్‌గారితో నటించటం మంచి ఎక్స్‌పీరియె్స్. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. అన్నీ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఎంటైర్‌టైనర్ ఇది. అందరినీ ఆలోచింప చేసే చిత్రం. జనవరి 24 నుంచి ప్రీమియర్ కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment