జోరుగా వడ్డీ దందా | microfinance business in agenct areas in adilabad | Sakshi
Sakshi News home page

జోరుగా వడ్డీ దందా

Published Thu, Oct 20 2016 12:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

వారం వారం డబ్బులు వసూలు చేసే కార్డు

వారం వారం డబ్బులు వసూలు చేసే కార్డు

గ్రామాల్లో విస్తరిస్తున్న మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం
మోసపోతున్న అమాయక గిరిజనులు
అందినకాడికి దండుకుంటున్న వ్యాపారులు
 
ఉట్నూర్‌ రూరల్‌ : ఏజెన్సీ గ్రామాల్లో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండలానికో మేనేజర్, ఏజెంట్ల నియామకంతో గ్రామాలు, తండాల వరకు దందా విస్తరించింది. మైక్రో ఫైనాన్స్‌ భూతం అమాయక గిరిజనులు, ప్రజల నడ్డి విరుస్తోంది. గిరిజనుల అమాయకత్వం.. అవసరం ఆంధ్రా వ్యాపారులకు పెట్టుబడిగా మారింది. వారం వారం వసూళ్ల పేరిట ఇంటింటికీ తిరిగి మరీ రుణాలు ఇస్తున్నారు. రూ.10 వేలు రుణం తీసుకున్న వారి నుంచి వారానికి రూ.100 చొప్పున 12 వారాల్లో రూ.1,200 వసూలు చేస్తున్నారు. మెుదటిసారి రుణం తీసుకున్న సమయంలో  ప్రామిసరీ నోటుపై సంతకం తీసుకుంటున్నారు. కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు రుణంగా ఇస్తున్నారు. రూ.వెయ్యి తీసుకుంటే వారానికి రూ.100 చొప్పున, రూ.10 వేలు తీసుకుంటే వారానికి రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో చెల్లింపు వారం ఆలస్యమైతే పది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి. గ్రామాల్లో కూలీలు, రైతులు, చిన్న చిన్న కిరాణ దుకాణాల నిర్వాహకులు మైక్రో ఫైనాన్షియర్ల వద్ద రుణాలు తీసుకుంటున్నారు.
 
క్రమపద్ధతిలో..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణ, ఒంగోలు ప్రాంతాలకు చెందిన నాలుగు వ్యాపార సంస్థలు మైక్రో ఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, జన్నారం, ఖానాపూర్, కడెం మండలాల్లో ఓ క్రమపద్ధతిలో వడ్డీ వ్యాపారం సాగుతోంది. మండలానికో మేనేజర్‌ను నియమించుకున్నారు. అతడి పరిధిలో గ్రామాల్లో తిరిగి రుణాలు ఇవ్వడానికి, వసూలు చేయడానికి మరికొంత మంది ఏజెంట్లు ఉన్నారు. గ్రామాల్లో ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని మిగితా వారూ రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఒక గ్రామంలో పది మంది రూ.10వేల చొప్పున అప్పు తీసుకుంటే.. వారం వారం ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేసి అదే గ్రామంలో మరొకరికి రూ.10వేలు అప్పుగా ఇస్తున్నారు. అలా గ్రామంలో వారానికి ఒకరికి చొప్పున రుణాలు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడికి, ఇతర అవసరాలకు ప్రజలు అప్పులు తీసుకుంటున్నారు.
 
12 వారాల్లో చెల్లించాల్సిందే.. 
మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న రుణం ఎంతైనా సరే 12 వారాల్లోగా చెల్లించాల్సిందే. రూ.వెయ్యి తీసుకుంటే వారానికి రూ.100 చొప్పున, రూ.10వేలు తీసుకుంటే వారానికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మరికొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇస్తున్నాయి. ఆరుగురు సభ్యులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేసి వారిలోనే ఒకరిని ఏజెంటుగా నియమించి మిగితా సభ్యుల నుంచి రుణాలు వసూలు చేస్తున్నాయి. వాయిదా ప్రకారం నిర్ణయించిన తేదీకి ఒక రోజు ఆలస్యమైనా పది శాతం వడ్డీ కలిపి వసూలు చేస్తున్నారు. వడ్డీ దందాపై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 
 
రూ.లక్షల్లో టర్నోవర్‌
గ్రామాల్లో మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తోంది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతోంది. ఉట్నూర్‌ మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 300 మందికి పైగా గిరిజనులు రుణాలు తీసుకున్నారు. దంతన్‌పెల్లి, బీర్సాయిపేట్, శంబుగూడ, చింతగూడెం, కొత్తగూడెం,  సాలెవాడ–బి పంచాయతీల పరిధిలోని మోతీరాంగూడ, బాబాపూర్, ముసల్‌పాడ్, హోల్వాడి, సాలెవాడ–బి తదితర గ్రామాల్లో మరో 500 మంది రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల అవసరానికి వారి ఇంటికే వచ్చి వ్యాపారులు అప్పులు ఇస్తుండడంతో తీసుకునేందుకు మెుగ్గు చూపుతున్నారు. వారం వారం వసూళ్లతో అతి కొద్ది సమయంలోనే లక్షల్లో టర్నోవర్‌ సాగుతోంది.  
 
అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు..
ఇంటింటికి తిరుగుతూ డబ్బులు అందిస్తున్నారు. దీంతో అవసరం ఉన్న వారు వడ్డీ ఎంతైనా సరే లెక్క చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు గ్రామాల్లో గ్రామమంతటా అప్పు తీసుకుంటూ మోసపోతున్నారు. 
– పంద్ర జైవంత్‌రావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకుడు 
 
అధికారులు దృష్టి సారించాలి
మైక్రోఫైనాన్షియర్లపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ఎక్కడి నుంచో వచ్చి అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారు. వారం వారం యథేచ్ఛగా డబ్బులు వసూలు చేసుకుంటూ తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గిరిజనులు ఆర్థిక భారం మోయాల్సి వస్తంది.
– మరప బాజీరావు, జంగుబాయి ఆలయ చైర్మన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement