సీఎంను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు | Minister V Srinivas Prasad spells bitter words on CM | Sakshi
Sakshi News home page

సీఎంను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు

Published Wed, Mar 2 2016 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

సీఎంను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు

సీఎంను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు

సిద్ధరామయ్యను అడిగి నేను ఈ మంత్రి పదవిలో కూర్చోలేదు. సిద్ధరామయ్య కంటే నేనే సీనియర్.

సాక్షి, బెంగళూరు:‘సిద్ధరామయ్యను అడిగి నేను ఈ మంత్రి పదవిలో కూర్చోలేదు. సిద్ధరామయ్య కంటే నేనే సీనియర్. నేను మంత్రి వర్గంలో ఉండడం వల్లే మంత్రి మండలికి గౌరవం వచ్చింది. నేను మంత్రిని కావడమే మంత్రి వర్గానికి గర్వ కారణం’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. మంత్రి మండలిలో తనకు ఎంతో నమ్మకమైన అనుచరుడిగా పేరున్న శ్రీనివాస ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్తంత ఇరకాటంలోనే పడ్డారు. ఇక శ్రీనివాస ప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో పరిశీలిస్తే.
 
 ....కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ కొన్ని రోజుల క్రితం ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘సిద్ధరామయ్య మంత్రి మండలిలో కొంతమంది అసమర్థ మంత్రులు ఉన్నారు. వారిని తప్పించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలుతగ్గిపోతాయి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మంత్రి మండలిలో మార్పులు చేయనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కదా, ఇందుకు మీరేమంటారు అంటూ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ను పాత్రికేయులు మంగళవారం ప్రశ్నించారు.
 
 ఇందుకు మంత్రి శ్రీనివాస ప్రసాద్ స్పందిస్తూ...‘నేనేమీ సిద్ధరామయ్యను అడిగి మంత్రి పదవిలో కూర్చోలేదు. వయసులో, అనుభవంలో కూడా నేను ఆయనకంటే సీనియర్‌నే. ’ అంటూ వాగ్భాణాలు విసిరారు. తద్వారా తనను మంత్రి మండలి నుంచి తప్పిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న విషయాన్ని సీఎం సిద్ధరామయ్యకు మంత్రి శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు.
 
 విశ్వనాథ్‌కు ప్రచార పిచ్చి...
 ఇక కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి శ్రీనివాస ప్రసాద్ మండిపడ్డారు. ‘విశ్వనాథ్‌కు ప్రచార పిచ్చి, అందుకే ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. విమర్శలు చేసేందుకు ఎవరూ దొరక్కపోతే ఆయన కుటుంబ సభ్యులపైనే విమర్శలకు దిగుతారు. విశ్వనాథ్ నాకు స్నేహితుడైనంత మాత్రాన ఒక మంత్రిగా ఉన్న నేను ఎక్కడికి వెళుతున్నాను, ఏం చేస్తున్నాను అన్న విషయాలన్నీ ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నన్ను ప్రశ్నించేందుకు ఆయనెవరు’ అంటూ మంత్రి శ్రీనివాస ప్రసాద్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement