ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం | Ministers, MLAs touchy on the wing .. | Sakshi
Sakshi News home page

ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం

Published Thu, Mar 24 2016 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం - Sakshi

ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం

మంత్రులపై అధికార పక్ష ఎమ్మెల్యేల మండిపాటు..


బెంగళూరు: రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల్లో ప్రజల దాహార్తిని తీర్చడంలో మంత్రుల అలసత్వం, వేళాపాళా లేని విద్యుత్ కోతలు, మూఢాచారాల నిరోధక చట్టం తీసుకువస్తామన్న ప్రభుత్వ ప్రకటన, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు ......ఈ అంశాలన్నీ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని కుదిపేశాయి. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రుల అలసత్వం, ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉండడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రులను నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలు, మంత్రుల పనితీరు కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని, ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీంతో బుధవారమిక్కడి విధాన సౌధ సమ్మేళన సభాంగణంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం వాడీవేడిగా జరిగిందని ఆ సమావేశంలో పాల్గొన్న అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...

 
ప్రజల దాహార్తిని తీర్చరా?

రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశించినప్పటికీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ‘రాష్ట్రంలో మన పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉన్నప్పటికీ మా నియోజకవర్గాల్లో సైతం ఎలాంటి పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లాలంటే కూడా భయమేస్తోంది. కరువు పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో పశువులకు ఆహారం సైతం లభించడం లేదు. వీటికి పరిష్కారాన్ని కనుగొనే దిశగా తక్షణమే చర్యలు ప్రారంభించాలి’ అని ఎమ్మెల్యేలు కోరారు. ఈ దిశగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి హెచ్.కె.పాటిల్ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యేలు వినిపించుకోకపోవడంతో ఆయన సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు.

 
అన్నీ ఏకపక్ష నిర్ణయాలేనా..... ఇక ప్రభుత్వం ఏసీబీని ఏర్పాటు చేయడంపై సైతం సమావేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఏసీబీని ఏర్పాటు చేసేముందు ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదు. శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత ఏసీబీ ఏర్పాటు చేసి ఉండల్సింది. అలా కాకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంలో ఏసీబీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు మనమే ఒక బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్లైంది’ అని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ అంశంపై సీఎం సిద్ధరామయ్య వివరణ ఇస్తూ....‘ఏసీబీని సరైన సమయంలోనే ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి సైతం తీసుకొచ్చాం’ అని తెలిపారు.ఇదే సందర్భంలో రాష్ట్రంలో మూఢాచారాల నిషేధ బిల్లులో ‘అగ్నిగుండాలను’ తొక్కడంపై నిషేధాన్ని సైతం చేరుస్తామన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర వ్యాఖ్యలపై సైతం శాసనసభా పక్ష సమావేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అగ్నిగుండాన్ని తొక్కడాన్ని నిషేధిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ‘మీ ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడి పార్టీని, మమ్మల్ని సమస్యల్లోకి నెట్టకండి’ అని ఎమ్మెల్యేలు మంత్రి టి.బి.జయచంద్రపై మండిపడ్డారు.  రాష్ట్రంలో వేళాపాళాలేని విద్యుత్ కోతలకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్‌పై సైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement