హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో సోమవారం విద్యుత్ సంక్షోభంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. కరెంట్ కష్టాలకు కాంగ్రెస్సే కారణమంటున్నారని, ప్రజల కోసమే యాత్రలు చేస్తే తప్పుపడతారా? అని శాసనసభా పక్షనేత జానారెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యక్తిగతంగా నిందించుకోవటం సరికాదని, అంతటికీ కాంగ్రెస్సే కారణమంటే తగదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షం ప్రజల కోసమే ఉందని, తాము ప్రతిపక్ష పాత్రను పోషించవద్దా అని జానారెడ్డి అన్నారు. విద్యుత్ సమస్యపై ఇరుప్రాంతాల మధ్య జరుగుతున్న ఉల్లంఘనపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అంతకు ముందు రుణమాఫీకి పలురకాలుగా కోతలు పెడుతున్నారని విపక్ష సభ్యులు ధ్వజమెత్తాయి. రుణమాఫీపై ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.