అందజేసిన బ్యాగులతో చిన్నారులు
సాక్షి, బెంగళూరు: శాంతినగర్ ఎమ్మెల్యే ఎన్‌ఏ హ్యారిస్ పుట్టిన రోజు వేడుకలు విద్యార్థులకు శాపంగా మారాయి. ఎమ్మెల్యే రాక ఆలస్యంగా కావడంతో పిల్లలు రెండు గంటలపాటు మండుటెండలో ఉండాల్సి వచ్చింది. వివరాలు.. హ్యారిస్ పుట్టినరోజు వేడుకలు గురువారం శాంతినగర్ పోలీసు హాకీ మైదానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరినీ తీసుకురావాల్సిందిగా ముందురోజు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు నిర్వాహకులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు ఉచితంగా లంచ్ బ్యాగులు అందజేస్తామని ప్రకటించారు.
వేడుకల ఆహ్వానాలను తిరస్కరించిన పాఠశాలలకు రవాణా సదుపాయాలను కల్పించి మరీ విద్యార్థులను మైదాన ప్రాంగణానికి నిర్వాహకులు చేర్చారు. అనుకున్నట్లుగానే ఉదయం 10.30కే విద్యార్థులు ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే విద్యార్థులు సమయానికి వచ్చినా ఎమ్మెల్యే మాత్రం రాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆయన కోసం మండుటెండలో రెండు గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే 12.30 గంటలకు తీరిగ్గా వచ్చినా వేడుకులను ముగించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత విద్యార్థులకు ఉచిత లంచ్ బ్యాగులు బహూకరించి పంపించారు. మిట్టమధ్యాహ్నం ఎండలో చిన్నపిల్లలను అంతసేపు నిలబెట్టడంపై స్థానికులు, టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment