న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీలో గొప్ప ఆకర్షణ శక్తి ఉందని బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సభలకు జనం అంతగా రారన్నారు. కాగా రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రభావం ఉండదంటూ ఇటీవల సీఎం షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకుగాను మోడీ నగర పరిధిలో జరిగే అనేక సభల్లో పాల్గొంటారన్నారు. రాహుల్, మోడీలు ఇటీవల నగరంలో నిర్వహించిన సభలను పోలుస్తూ రాహుల్‌గాంధీ సభకు వేల సంఖ్యలో కూడా జనం రాలేదన్నారు. అదే నరేంద్రమోడీ సభకు లక్షల సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారన్నారు. దీని ప్రభావం కచ్చితంగా భారీగానే ఉంటుందన్నారు. నరేంద్రమోడీ భావి భారత ప్రధానమంత్రి అంటూ ధీమా వ్యక్తం చేశారు. మోడీ రాకతో కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు నిరాశకు లోనయ్యారన్నారు. అనేక సంవత్సరాలపాటు నరేంద్ర మోడీపై వారంతా నోరుపారేసుకున్నారని, అయిననప్పటికీ ఫలితం లేకపోయిందని అన్నారు.
మద్దతు తగ్గుతోంది
కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటగా భావించే మంగోల్‌పురి నియోజకవర్గంలో ఇటీవల రాహుల్‌గాంధీతో సభ నిర్వహించిందని, అయితే ఆ సభకు ఆశించిన రీతిలో జనం రాలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. దీంతో ఆ పార్టీకి ప్రజల మద్దతు తగ్గిపోతోందనే విషయం తేటతెల్లమైందన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకుడు రాజ్‌కుమార్ చౌహాన్ వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో రాజ్‌కుమార్ చౌహాన్ మంచి శక్తిమంతమైన మంత్రి అని, అంతేకాకుండా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు అత్యంత సన్నిహితుడన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం
ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తాము ఓడించడం తథ్యమన్నారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. భారీ జనాకర్షణ కలిగిన వ్యక్తి నరేంద్రమోడీ అనే విషయాన్ని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గుర్తుంచుకోవాలన్నారు. జయప్రకాష్ నారాయణ్, ఇందిరాగాంధీ సభలను కూడా తాను చూశానని, మోడీ సభకు కనీసం ఎనిమిది లక్షలు మొదలుకుని 12 లక్షల మంది దాకా ప్రజలు హాజరవుతున్నారని మీరు ఊహించగలరా? అంటూ మీడియాను ప్రశ్నించారు.
విభేదాలు లేనే లేవు
పార్టీలో అంతర్గత విభేదాలు, విజయ్‌గోయల్‌తో సంబంధాల విషయమై ప్రశ్నించగా పార్టీ విజయం కోసం నాయకులంతా కలసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పుడుగానీ లేదా గతంలోగానీ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. గత అనేక సంవత్సరాలుగా విజయ్‌గోయల్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను పార్టీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఎంపిక చేసిందన్నారు. అయినప్పటికీ తనకు సంపూర్ణ మద్దతు ఇస్తానని గోయల్ తనకు చెప్పాడన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కూడా చెప్పాడన్నారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సందేహమూ లేదన్నారు. గోయల్ మంచి చురుకైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. గొప్ప పోరాట యోధుడన్నారు. పార్టీకి అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నాడన్నారు. కలసికట్టుగా పనిచేస్తామని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రాజధాని నగర సమగ్ర లక్ష్యమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. నగరంలోని అనధికారిక కాలనీలు, జుగ్గీజోపిడీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ)మాదిరి మరో ప్రత్యేక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిద్వారా ఆయా ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలతోపాటు ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని 1639 అనధికారిక కాలనీలతోపాటు 400 గ్రామాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నేటికీ రాజధాని నగరంలోని 40 శాతం మంది ప్రజలకు మంచినీరు అందడం లేదన్నారు. 40 లక్షల మంది అనధికారిక కాలనీవాసుల ఇబ్బందులను 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, అధిక ధరలతో ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్‌పార్టీ నుంచి నగరవాసులకు త్వరలోనే విముక్తి కలిగిస్తామన్నారు.
త్వరలో మళ్లీ ఇంటింటి ప్రచారం షురూ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక తర్వాత భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనుంది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వల్ల గత నెలలో ‘ఘర్ ఘర్’ కార్యక్రమం నిలిపివేశామని ఆ పార్టీ నాయకుడు ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. అక్టోబర్ 16న సివిల్ లైన్స్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రారంభించారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అయితే సీఎం అభ్యర్థి ఎంపిక వల్ల నిలిచిపోయిన దీన్ని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థితో పాటు పార్టీ తరఫున ఐదుగురు సభ్యులు ఇంటింటికి వెళ్లి పార్టీ ఆలోచనలు పంచుకుంటారని వివరించారు. డిసెంబర్ నాలుగున 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల కోసం 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల ఐదున పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందన్నారు.
మోడీ.. మహా ఆకర్షక శక్తి
Published Tue, Nov 5 2013 1:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement