సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వేసవి కాలం ముగిసినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టక పోగా రోజు రోజుకు ఆకాశ మార్గాన విహరిస్తున్నాయి. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులో లేవు. కొత్తిమీర, పుదీనా లాంటి వాటి ధరలు వాకబు చేస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. బీన్స్ ధర నెల రోజులుగా రూ.80-90 మధ్య నిలకడగా ఉంటోంది.
ముల్లంగి రూ.45-50, కాలిఫ్లవర్ రూ.60, బీట్రూట్ రూ.34, క్యాబేజీ రూ.20, ఉల్లిపాయలు రూ.32-35, బంగాళాదుంపలు రూ.35 చొప్పున పలుకుతున్నాయి. వంటల తయారీలో నిత్యం అత్యవసరంగా భావించే కొత్తిమీర ధర కేజీ. రూ.200గా ఉంది. చిల్లర వర్తకులు ఫారం ఆకు కూర కట్టను డిమాండ్‌ను బట్టి రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. నాటు కూరాకు మార్కెట్లకు రావడమే లేదు. మెంత్యాకును హాప్‌కామ్స్‌లో కేజీ రూ.120 చొప్పున అమ్ముతున్నారు. వేరే చోట్ల చిన్న కట్టలను రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
పుదీనా ధర కట్టకు రూ.5 నుంచి రూ.20కి ఎగబాకింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు ధాన్యాల ధరలు స్వల్పంగా తగ్గాయి. దాదాపు అన్ని రకాల ధాన్యాలు కేజీకి రూ.5 నుంచి రూ.15 వరకు తగ్గు ముఖం పట్టాయి. కాగా కొన్ని చోట్ల నీటి కొరత, మరి కొని చోట్ల భారీ వర్షాల కారణంగా కూరగాయల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలకు భారీ ఎత్తున కూరగాయలు రవాణా అవుతున్నందున, ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు.
మరింత ప్రియం
Published Tue, Jun 17 2014 2:04 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement