పెంచడానికి స్థోమత లేక ఆ పని చేశా..
నాగర్‌కోవిల్ సమీపంలో కన్న బిడ్డలను హత్య చేసి పూడ్చిపెట్టిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
కేకేనగర్ : నాగర్‌కోవిల్ సమీపంలో కన్న బిడ్డలను హత్య చేసి పూడ్చిపెట్టిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. కన్యాకుమారి జిల్లా ఈత్తా మొళి సమీపంలో గల కాట్రాడితట్టు ప్రాంతానికి చెందిన కన్నన్ (39) భార్య దివ్య. దివ్యకు మొదట అనుహ్య (02) అనే ఆడపిల్ల ఉంది. ఈనేపథ్యంలో రెండవ సారి గర్భం దాల్చిన దివ్యకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. తర్వాత కన్యాంకులంలో గల తన పుట్టింటికి వెళ్లిన దివ్య అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో గత 2వ తేది ఇద్దరు కవల పిల్లలు మృతి చెంది కనిపించారు. తల్లిపాలు తాగేప్పుడు వారికి ఊపిరాడక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే చంటి బిడ్డల మృతిపై అనుమానం వ్యక్తం కావడంతో కాట్రాడితట్టిలో గల దివ్య ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన కవలల మృతదేహాలను వెలికి తీసి తహసీల్దార్ ముందు వెలికి తీసి పోస్టుమార్టం జరిపారు. వైద్య ఫలితాలలో శిశువులను హత్య చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు శిశువుల తల్లి దివ్య, ఆమె భర్త వద్ద విచారణ జరిపారు. విచారణలో దివ్య శిశువులను స్వయంగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. అప్పటికే తనకు కుమార్తె ఉండడంతో మరో ఇద్దరు ఆడ పిల్లలను పెంచడానికి స్థోమత లేక హత్య చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు దివ్యను అరెస్టు చేశారు.