కనిమొళి కసరత్తు
చతికిలబడిన మహిళా విభాగంలో పునరుత్తేజం నింపడం లక్ష్యంగా ఎంపీ కనిమొళి కసరత్తుల్లో పడ్డారు. మహిళాకర్షణే లక్ష్యంగా అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. యువజన విభాగం తరహాలో మహిళా విభాగంతో పార్టీలో పట్టు కోసం వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 14న చెన్నై వేదికగా మహిళా విభాగం కార్యవర్గం భేటీకి పిలుపునిచ్చారు.
సాక్షి, చెన్నై : డీఎంకేలో మహిళా విభాగం ఉన్నా, ఆ విభాగంతో పార్టీకి ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో గత కొన్నేళ్లుగా ఈ విభాగం నమ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక చురుగ్గా దూసుకెళుతున్న అన్నాడీఎంకే మహిళా విభాగం తరహాలో తమ పార్టీలోని విభాగాన్ని సైతం తీర్చిదిద్దాలన్న ఆశ కరుణానిధిలో ఉన్నా, ఆచరణలో విఫలం అవుతూ వచ్చారు. పార్టీలోని యువజన విభాగానికి కోశాధికారి ఎంకే స్టాలిన్ ఏళ్ల తరబడి నాయకత్వం వహిస్తూ రావడంతో, ఆ విభాగం పార్టీకి పట్టుకొమ్మగా ఉంటున్నారు. దీన్ని పరిగణించిన కరుణానిధి మహిళా విభాగానికి పటిష్ట నాయత్వం అవసరమని గుర్తించారు. ఎట్టకేలకు తన గారాల పట్టిని అందలం ఎక్కించడంతోపాటుగా మహిళా విభాగం బలోపేత బాధ్యతల్ని ఆమె భుజాన వేశారు. పార్టీలో పదవి కోసం ఆశించి చివరకు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్న కనిమొళి తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో ఆ విభాగం బలోపేతానికి కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు.
పట్టుకు వ్యూహం : మహిళా విభాగం బలోపేతంతో పాటుగా, పార్టీ పరంగా పట్టు సాధించడం లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో కనిమొళి పడ్డారు. అధినేత కరుణానిధి సూచనలు, సలహాలను అనుసరిస్తూనే, తన దైన శైలిలో మహిళాకర్షణకు సిద్ధం అయ్యారు. యువజన విభాగాన్ని ఏ మేరకు కోశాధికారి ఎంకే స్టాలిన్ పటిష్ట వంతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, దాన్ని తలదన్నే రీతిలో మహిళా విభాగాన్ని పార్టీకి పట్టుకొమ్మగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహిళా విభాగం నాయకులందర్నీ పిలిపించి, వారి వారి అభిప్రాయాల్ని స్వీకరిస్తున్న కనిమొళి, ఇక తన వ్యూహాల్ని అమలు చేయించి బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
14న భేటీ: మహిళా విభాగం బలోపేతంతో పాటుగా, ఆ విభాగం నేతృత్వంలో మహిళా సమస్యల్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిని మహిళా విభాగం నాయకుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని అమలు చేయించేం దుకు నిర్ణయించారు. ఇందు కోసం ఈనెల 14న చెన్నై వేదికగా రాష్ట్ర, జిల్లా మహిళా విభాగాలతో భేటీకి నిర్ణయించారు. అందరూ తప్పని సరిగా ఈ సమావేశానికి హాజరయ్యే రీతిలో ఆహ్వానాల్ని పం పించారు. ప్రధానంగా ఈ సమావేశంలో మహిళా విభాగంలోని సీనియర్లను కలుపుకుంటూ, సరికొత్త మార్గంలో పయనించే విధంగా కనిమొళి కసరత్తులు చేశారని అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయం సహాయక బృందాల్లోని మహిళల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టబోతున్నారని చెబుతోన్నారు.
ఐటీ, వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో రాణిస్తున్న మహిళా ప్రముఖుల్ని కలవడం, వారి సహకారంతో ఆయా రంగాల్లోని మహిళలను పార్టీలోకి ఆహ్వానించే విధంగా వినూత్న ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేస్తూ కనిమొళి కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళల సహకారంతో కార్యక్రమాల్ని వేగవంతం చేసే విధంగా ఈ భేటీలో తన మార్కు వ్యూహాల్ని అమలు పరిచేందుకు కనిమొళి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానంతరం రోజుకో జిల్లా చొప్పున పర్యటించి, మహిళా విభాగం నాయకుల్ని ఉత్సాహ పరిచే విధంగా కార్యక్రమాలు, మహిళా విభాగం సభ్యత్వ నమోదు ప్రక్రియతో బలోపేతం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లే విధంగా తన డైరీలో బిజి బిజీ షెడ్యూల్‌ను ఆమె రూపొందించుకున్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటుండటం విశేషం.