ప్రమాదాల నివారణకు ఎంటీసీ చర్యలు
టీనగర్, న్యూస్‌లైన్: బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుండడంతో విద్యార్థులు అధికంగా ప్రయాణించే బస్‌రూట్లను గుర్తించి పరి శీలన జరిపేందుకు నగర మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ 25వ తేదీన కోవలం నుంచి ప్యారిస్ వైపు వస్తున్న సిటీ బస్ (19జీ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన నీలాంగరై విద్యార్థి కన్నన్ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. గతవారం సుంగువారి సత్రం నుంచి తిరువళ్లూరుకు బయలుదేరిన ప్రభుత్వ బస్సు (టీ84ఎ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన 10వ తరగతి విద్యార్థి అరవింద్ 15 బన్నూరు బస్టాండ్ సమీపంలో జారిపడి మృతి చెందాడు.
ఈ నెల తొమ్మిదవ తేదీన పెరంబూరు, మాధవరం హైరోడ్డులో వెళుతున్న సిటీ బస్సు (7జీ) ఫుట్‌బోర్డులో ప్రయాణించిన కార్తీక్ (16) కింద పడి మృతి చెందాడు. ఫుట్‌బోర్డు ప్రయాణాలతో అనేక మంది విద్యార్థులు మృత్యువాత పడడంతో నిర్ణీత బస్సు రూట్లలో పీక్ అవర్స్‌లో ఎక్కువ బస్సులు నడపాలంటూ ఎంటీసీకీ విజ్ఞప్తులు అందాయి.
బస్సు రూట్ల పరిశీలన: విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే రూట్ల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. బుధవారం ఎంటీసీ అధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ప్రమాదాలను నివారించేందుకు ఏఏ రూట్లలో అధిక బస్సులు నడపాలనే విషయపై చర్చలు జరిపారు. దీని గురించి నగర రవాణా సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ ఎంటీసీ ఆదాయ వనరుల విభాగానికి చెందిన ఆరుగురు సభ్యులతో బృందాలను ఏర్పరచి నగర మంతా పరిశీలన జరిపేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్ణీత బస్సు రూట్లలో అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు చర్యలుతీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.