ఎదురుచూపులు ఎన్నాళ్లు?
Published Thu, Aug 29 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
వెంటనేఅనుమతులు ఇవ్వాలంటున్న డ్యాన్స్ బార్ల యజమానులు
సాక్షి, ముంబై:రాష్ట్రంలో డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసి రెండు నెలలు దాటినా ఇంకా అవి తెరుచుకోలేదు. ఒక్క ముంబైలోనే దాదాపు 200 బార్లు పోలీసుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. వెంటనే అనుమతులు ఇవ్వాలని బార్ల యజమానులు కోరుతున్నారు. లేదంటే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. సుప్రీం తీర్పుతో బార్లలో డ్యాన్సులు చేసే యువతుల్లో, ఇటు యజమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో పునరాలోచనలో పడింది.
నిజానికి డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. అయితే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండడంతో నిషేధాన్ని ఎత్తివేస్తారని అందరూ భావించారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.
సందిగ్ధతలో పోలీసులు...
రాష్ట్ర పరిపాలనా విభాగం నుంచి ఆదేశాలు వస్తేగానీ బార్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పటిదాకా అటువంటి ఆదేశాలేవీ తమకు అందనందున డ్యాన్స్ బార్ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు. అయితే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సి బాధ్యత పోలీసులపై కూడా ఉండడంతో అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంతో పోలీసులున్నారు. అయితే నిషేధాన్ని కొనసాగిస్తామని ఆర్‌ఆర్ పాటిల్ అసెంబ్లీలో ప్రకటించినా అందుకు సంబంధించి కూడా పరిపాలనా విభాగం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అనుమతి ఇవ్వాలా? నిషేధాన్ని కొనసాగించాలా? అనే విషయమై ఎటువంటి స్పష్టత లేదనే విషయాన్ని పోలీసులే అంగీకరిస్తున్నారు.
కోర్టుకు వెళ్లే యోచనలో...
న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడమంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బార్ల యజమానులు చెబుతున్నారు. పిటిషన్ వేసేందుకు తాము సిద్ధమవుతున్నామని బార్ యజమానులు చెప్పారు. ఒకవేళ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, పోలీసు కమిషనర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Advertisement