సాక్షి, ముంబై : మంత్రాలయ భవనం వద్ద ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ‘‘ముంబైలో ఉంది మంత్రాలయ భవనం కాదు.. ఆత్మహత్యాలయ భవనం’’ అని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించిన రోజే మంత్రాలయలో మరో ఆత్మహత్య చోటుచేసుకుంది. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ ప్రాంతానికి చెందిన హర్షల్ రావుతే (45) గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మంత్రాలయ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతణ్ని అంబులెన్స్‌లో సీఎస్‌ఎంటీ సమీపంలో ఉన్న సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సామాన్య పరిపాలనా విభాగంలో..
పైఠణ్ ప్రాంతానికి చెందిన హర్షల్ రావుతే కొద్ది రోజులుగా ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిసింది. కాగా, గురువారం మధ్యాహ్నం మంత్రాలయ భవనానికి వచ్చాడు. సామాన్య పరిపాలన విభాగం కార్యకలాపాలు నిర్వహించే ఐదో అంతస్తులోకి వెళ్లినట్లు ప్రవేశ ద్వారం వద్ద ఎంట్రీ పాస్ జారీచేసే కౌంటర్‌లో నమోదైన వివరాలను బట్టి తెలిసింది. కాగా, అతడు సామాన్య పరిపాలన విభాగంలో ఎవరితో భేటీ అయ్యాడు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో వివరాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు రాధాకృష్ణ విఖే పాటిల్, ధనంజయ్ ముండే అజీత్ పవార్, జయంత్ పాటిల్ తదతర ప్రముఖులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవడానికే మంత్రాలయకు..: రాజ్ ఠాక్రే
ఒకప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవసాయ భూములకు వెళ్లే వారని.. కానీ, ఇప్పుడు మంత్రాలయకు వస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే ధ్వజమెత్తారు. 2014లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కంటే బీజేపీ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందని బీజేపీ నాయకులు ప్రగాల్భాలు పలికారని, కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు.
మూడేళ్లలో పెరిగిపోయింది..
వరుసగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యా ఘటనలపై రాజ్ ఠాక్రే బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పాలన కంటే బీజేపీ కూటమి పాలన భిన్నంగా ఉందని రాజ్ ఠాక్రే విమర్శించారు. గడచిన మూడేళ్లలో మంత్రాలయ ప్రవేశ ద్వారం వద్ద ఆత్మహత్య, ఆత్మహత్యా యత్నం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయిందన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్–ఎన్సీపీ పాలనతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వం ఎంతో భయానకంగా ఉందని చెప్పాల్సి వస్తోందని ఎద్దేవాచేశారు. మూడేళ్ల కాలంలో నిరుద్యోగ యువకులు, రైతులు, అన్యాయం జరిగిన బాధితులు మంత్రాలయ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని, కానీ, న్యాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఇక తమకు న్యాయం జరగదని తెలుసుకున్న బాధితులు విసుగెత్తి ఆత్మహత్య చేసుకునేందుకు మంత్రాలయ ప్రవేశ ద్వారాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. ధర్మ పాటిల్ ఆత్మహత్య చేసుకున్న తరువాత ధర్మ పాటిల్ కోల్పోయిన భూముల నష్టపరిహార వివాదం కాంగ్రెస్–ఎన్సీపీ హాయాంలోదని బీజేపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, మేరెందుకు సరైన నష్టపరిహారం ఇవ్వదలేని నిలదీశారు.
ధర్మ పాటిల్ ఆత్మహత్యకు ముందు 2016 మార్చిలో మాధవ్ కదం అనే వ్యక్తి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రాలయ ప్రవేశ ద్వారం వద్ద విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. అదే సంవత్సరం రాజు ఆంగ్లే అనే యువకుడు ఉద్యోగం దొరక్కపోవడంతో ఆత్మహత్య యత్నం చేశాడని తెలిపారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి మంత్రాలయ భవనం ఆరో అంతస్తు నుంచి దూకే ప్రయత్నం చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఆరో అంతస్తులో జాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఎద్దేవాచేశారు. కానీ, ఇలా జాలీలు ఏర్పాటు చేసి.. నిధులు వృథా చేసే బదులుగా బాధితుల సమస్యలు పరిష్కరిస్తే ఆత్మహత్య చేసుకునే అవసరమే రాదని హితవు పలికారు.
పెరోల్‌పై రాక..
హర్షల్ రావుతేకు తన మరదలు హత్యకేసులో 14 ఏళ్ల శిక్ష పడింది. ఇటీవల పైఠణ్ జైలు నుంచి పెరోల్‌పై విడుదలైనట్లు తెలిసింది. దీంతో హర్షల్ రావుతే ఆత్మహత్య కథ మరో మలుపు తిరిగింది. మంత్రాలయకు వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకోవల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పక్షం రోజుల్లో ఇది మూడో సంఘటన కావడంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలకు మంచి అవకాశం లభించినట్లైంది. మంత్రాలయం భవనం వద్ద నెల రోజుల కింద ధుళే జిల్లాకు చెందిన ధర్మ పాటిల్, తాజాగా బుధవారం అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన అవినాశ్ శేటే (25) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలు తాజాగా ఉండగానే గురువారం హర్షల్ రావుతే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment