పోరు తీవ్రం
గణపతి ఆత్మహత్యపై మోదీకి నివేదిక
బీజేపీ నిర్ణయం
బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించిన ఘటనలో న్యాయం కోరుతూ భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేయనుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. గణపతి ఆత్మహత్య ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించడంతోపాటు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కే.జే జార్జ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని రెండు రోజులగా బీజేపీ చట్టసభల్లో అహోరాత్రి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టసభలు సోమవారానికి వాయిదా పడిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ విధానసౌధలోని దివంగత ముఖ్యమంత్రి కెంగల్‌హనుమంతయ్య ప్రతిమ వద్ద చేరుకున్నారు. మెడలో నల్లకండువాలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప విధానసౌధకు చేరుకుని సహచరులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భవిష్యత్ కార్యకలాపాలకు సంబంధించి పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు.
కే.జే.జార్జ్ రాజీనామ చేసేంతవరకూ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విషయమై చివరి సారిగా ప్రభుత్వం నిర్ణయం కోసం సోమవారం వరకూ బీజేపీ వేచిచూస్తుంది. అప్పటికీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాకపోతే సోమవారం విధానసౌధ నుంచి పాదయాత్ర ద్వారా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్ వాలాను కలిసి గణపతి ఆత్మహత్యకు గల కారణాలతో ఆపటు ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించానున్నారు. అటు పై గణపతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి మొత్తం వ్యవహారాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీకి నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఆ సమయంలో గణపతి భార్య, పిల్లలను కూడా తమతో పాటు తీసుకువెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. ఇక నేడు (శనివారం) శాసనసభ విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ మడికేరికి వెళ్లి గణపతి కుటుంబాన్ని పరమార్శించనున్నారు. అదేవిధంగా యడ్యూరప్ప మంగళూరులో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో పాల్గొనననున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా విపక్షాలు చట్టసభల్లోనే నిద్రించాయి. శని, ఆదివారాల్లో చట్టసభలు జరగవు కనుక ఆ రెండు రోజులు చట్టసభల్లో కాకుండా కొడుగుతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కే.జేజార్జ్ రాజీనామ కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయనున్నారు. అదేవిధంగా డీ.ఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో బెంగళూరులో బృహత్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా లేదా ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ విషయమై ఈనెల 18న పార్టీ పదాధికారులతో సమావేశమయ్యి యడ్యూరప్ప స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా మంగళూరు నుంచి బెంగళూరు వరకూ బీజేపీ పాదయాత్ర చేయాని నిర్ణయించింది.
సీఎం రాజీనామా చేయాలి..
నిరసన కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారులు తీవ్ర ఒత్తిళ్లతో పనిచేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు విపరీతరాజకీయ జోక్యమే కారణమని తెలిపారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే తన పదవికి రాజీనామ చేయాలని ఆర్.అశోక్ డిమాండ్ చేశారు.