సాక్షి, ముంబై: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం కార్లలో ప్రయాణిస్తున్న వారే మృతి చెందారు. రోడ్డు ప్రమాదానికి గురైన వివిధ వాహనాల్లో మరణించిన సంఖ్యతో పోలిస్తే వీరి సంఖ్య 58 శాతం ఉన్నట్లు ‘జేపీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల సంఖ్య పెరగడానికి గల ప్రధాన కారణాలను తెలుసుకునేందుకు ఇటీవల కోయంబత్తూర్‌కు చెందిన జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేసింది.
వాహనాలు అధిక వేగంగా వెళ్లే రహదారిగా గుర్తింపు పొందిన ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే పై ఏటా కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు మృతి చెందుతున్నారు. వీటిని అరికట్టేందుకు జాతీయ రహదారుల శాఖ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మానవ తప్పిదమో, లేక సాంకేతిక లోపమో కానీ పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. దీంతో అసలు ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయోనని వివరాలు తెలుసుకునేందుకు జేపీ రీసెర్చ్ కంపెనీ సర్వే చేపట్టింది. 2012 నవంబర్ నుంచి 2013 అక్టోబర్ వరకు 214 రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేసింది.
ఇందులో ముంబై-పుణే న గరాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలే ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. ఇవి కామ్‌శేత్ ఘాట్ పరిసరాల్లోనే జరిగాయి. 55 శాతం ప్రమాదాలు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల, 46 శాతం సీటు బెల్టు పెట్టుకోకపోవడంవల్ల జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపు జరిగిన ప్రమాదాలు 58 శాతం ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్ల నిద్రమత్తు డ్రైవింగ్ వల్ల 75 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 81.5 శాతం మానవ తప్పిదంతో, మిగతావి వాహనాల సాంకేతిక లోపంతో జరిగాయి. రోడ్లు, మౌలిక సదుపాయాల కొరతవల్ల 24.9 శాతం ప్రమాదాలు జరిగినట్లు జేపీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. మొత్తంగా అత్యధిక శాతం ప్రమాదాలు డ్రైవర్లకు నిద్రముంచుకురావడం వల్లే జరిగాయని తుది నివేదికలో వెల్లడించింది. ఈ రహదారిపై జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 67 శాతం కేసులు నమోదు చేయలేద ని తెలిపింది.
ఫలితం లేని ప్రచార కార్యక్రమాలు
ప్రాణం ఎంతో విలువైంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే తపన, అందుకు వాహన వేగాన్ని పెంచడం, విశ్రాంతి లేకుండా డ్రైవర్ వాహనాన్ని డ్రైవింగ్ చేయడం తదితర కారణాలు ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. ఫలితంగా అమాయకులు ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాద‘కారు’లు
Published Fri, Jan 10 2014 12:24 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement