సిసలైన గ్రామీణ నాయకుడు..!
ముండేను కొనియాడిన అసెంబ్లీ నివాళులర్పించిన అధికార, ప్రతిపక్షాలు
ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండేకు మహారాష్ట్ర అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన రోజే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నివాళి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన నేత గోపీనాథ్ ముండే. పట్టణ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఆయన గ్రామీణ నేత. ఎన్నికలను ఎప్పుడూ ఆయన తేలికగా తీసుకునేవారు కాదు. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లేవారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయమై ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించేది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన మరణించడం విచారకరం. ఆయన కల(ముఖ్యమంత్రి కావాలన్న) నెరవేరకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. చివరిసారిగా ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. తన మంత్రిత్వశాఖ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. బడ్జెట్ కేటాయింపుల గురించి తాను చర్చించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన స్నేహం చేసేవారు. ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పింకోవాలని చూడలేదు. మరో పదిహేను రోజుల తర్వాత కలుద్దామని చెప్పాను. తనకు చాలా సమయముందని, ఎప్పుడైనా కలుసుకుందామని చెప్పి అందరాని లోకాలకు వెళ్లిపోయార’ని గుర్తుచేసుకున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ... బీజేపీ శివసేనలు కూటమిగా ఏర్పడ్డాక ముండే రాజకీయ ప్రస్థానం మొగ్గతొడగడం మొదలైంది. బాల్‌ఠాక్రేతో ముండేకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేది. రైతుల సంక్షేమం కోసం కృష్ణావ్యాలీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ముండేదే. అందరిపట్ల అభిమానం చూపే వ్యక్తి ఆయన. కిందిస్థాయి కార్యకర్తలు ఎదుగుతున్నారని ఎంతో సంబరపడిపోయేవారు. వారి ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఆయన భయపడలేదు. పార్టీ పటిష్టానికి ఇది శుభపరిణామం అనేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనమధ్య లేకపోవడం తీరని లోటు’ అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నారాయణ్ రాణే మాట్లాడుతూ... ‘గ్రామీణ అంశాలపై ముండేకు గట్టి పట్టు ఉందన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు ముండే చేసిన సేవలు మరువలేనివని ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కొనియాడారు. తమ ఓబీసీ డిమాండ్‌కు మద్దతు పలికిన మొట్టమొదటి బీజేపీ నేత ముండే అని గుర్తుచేసుకున్నారు. సుభాష్ దేశాయ్, పతంగ్‌రావ్ కదమ్ తదితరులు కూడా ముండే సేవలను కొనియాడారు.