Union Rural Development Minister
-
సిసలైన గ్రామీణ నాయకుడు..!
ముండేను కొనియాడిన అసెంబ్లీ నివాళులర్పించిన అధికార, ప్రతిపక్షాలు ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండేకు మహారాష్ట్ర అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన రోజే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నివాళి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన నేత గోపీనాథ్ ముండే. పట్టణ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఆయన గ్రామీణ నేత. ఎన్నికలను ఎప్పుడూ ఆయన తేలికగా తీసుకునేవారు కాదు. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లేవారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయమై ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించేది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన మరణించడం విచారకరం. ఆయన కల(ముఖ్యమంత్రి కావాలన్న) నెరవేరకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. చివరిసారిగా ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. తన మంత్రిత్వశాఖ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. బడ్జెట్ కేటాయింపుల గురించి తాను చర్చించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన స్నేహం చేసేవారు. ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పింకోవాలని చూడలేదు. మరో పదిహేను రోజుల తర్వాత కలుద్దామని చెప్పాను. తనకు చాలా సమయముందని, ఎప్పుడైనా కలుసుకుందామని చెప్పి అందరాని లోకాలకు వెళ్లిపోయార’ని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ... బీజేపీ శివసేనలు కూటమిగా ఏర్పడ్డాక ముండే రాజకీయ ప్రస్థానం మొగ్గతొడగడం మొదలైంది. బాల్‌ఠాక్రేతో ముండేకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేది. రైతుల సంక్షేమం కోసం కృష్ణావ్యాలీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ముండేదే. అందరిపట్ల అభిమానం చూపే వ్యక్తి ఆయన. కిందిస్థాయి కార్యకర్తలు ఎదుగుతున్నారని ఎంతో సంబరపడిపోయేవారు. వారి ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఆయన భయపడలేదు. పార్టీ పటిష్టానికి ఇది శుభపరిణామం అనేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనమధ్య లేకపోవడం తీరని లోటు’ అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నారాయణ్ రాణే మాట్లాడుతూ... ‘గ్రామీణ అంశాలపై ముండేకు గట్టి పట్టు ఉందన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు ముండే చేసిన సేవలు మరువలేనివని ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కొనియాడారు. తమ ఓబీసీ డిమాండ్‌కు మద్దతు పలికిన మొట్టమొదటి బీజేపీ నేత ముండే అని గుర్తుచేసుకున్నారు. సుభాష్ దేశాయ్, పతంగ్‌రావ్ కదమ్ తదితరులు కూడా ముండే సేవలను కొనియాడారు. -
మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద దిక్కు
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా వారం కిందట తొలిసారి పగ్గాలు చేపట్టిన గోపీనాథ్ ముండే మహారాష్ట్రలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉండేవారు. మహారాష్ర్ట రాజకీయాలను శాసించే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను సైతం కంగు తినిపించేలా తన వ్యూహచతురతతో 1995లో బీజేపీ-శివసేన కూట మిని ఆయన అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతమైన మరాఠ్వాడాలో ఓ నిరుపేద బీసీ కుటుం బంలో జన్మించారు. దివంగత బీజేపీ నేత వసంత్‌రావు భాగవత్ చొరవతో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. మహారాష్ట్రలో ఆయనకున్న మాస్ ఇమేజి ఆ పార్టీలోని ఇతర కీలక నాయకులెవరికీ లేకపోవడం ముండేపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముండే డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి మహాకూటమిగా బరిలో నిలపడంలో ముండే కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లకుగానూ మహాకూటమి 42 సీట్లలో గెలుపొందింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది సీఎం పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. 2009లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ముండే.. గతనెల 26న మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు పంచాయతీ రాజ్, మంచినీరు-పారిశుద్ధ్య శాఖల బాధ్యతలు కూడా తీసుకున్నారు. వ్యక్తిగత జీవితం: ముండే పూర్తిపేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నత్రాలో జన్మించారు. తల్లిదండ్రులు లింబాబాయి, పాండురంగ్ ముండే. ముండే బీకాం, లా పట్టాలు పుచ్చుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నారు. ముండే ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన పంకజ ఎమ్మెల్యే. ఆమె బీడ్ జిల్లా పర్లీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమార్తె ప్రతిమ డాక్టర్ కాగా, చిన్న కుమార్తె యశశ్రీ న్యాయవిద్య అభ్యసిస్తున్నారు. -
సన్నిహితుడిని కొల్పోయాను: మోడీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మృతి దేశానికి, ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గోపీనాథ్ ముండే నిజమైన ప్రజానాయకుడని ఆయన అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఆయన సేవలు మరువరానివని ముండే సేవలను మోడీ కొనియాడారు. ముండే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముండే తనకు అత్యంత ఆప్తుడు, సహచరుడుని కొల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్లో చేరి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ఇలా జరగడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి గోపినాథ్ ముండే మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపాన్ని తెలిపారు. న్యూఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాథ్ ముండే (64)ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో గోపీనాథ్ ముండే మరణించారు.