సంగీతమూ అంతే ముఖ్యం
సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో సంగీతం, పాటలు కూడా అంతే ముఖ్యం. సంగీతంలో పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చక్కని సాహిత్యం కూడా వినిపించకుండా పోతోందని సాహితీప్రియులు ఆవేదన చెందటం చూస్తున్నాం. అలాంటిది నేను చేసే చిత్రాల్లో అన్ని పాటలు హిట్ అవ్వాలి. పాటలతో పాటు సంగీతం చిత్రానికి ప్లస్ కావాలి అంటున్నారు సంగీత దర్శకుడు సౌందర్యన్. సంగీత దర్శకుడిగా ఈయన అనుభవం రెండున్నర దశాబ్దాలు. ఇప్పటి వరకు చేసింది 42 చిత్రాలు. తొలి చిత్రమే సూపర్ హిట్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఆర్‌బి చౌదరి నిర్మించిన చేరన్‌పాండియన్. దర్శకుడు కేఎస్ రవికుమార్. ఇందులో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి.
ఆ తరువాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరుసగా ముదల్‌శీదనం, పుత్తంపుదు పయనం, ముత్తు కుళిక వారియాల్ అంటూ నాలుగు చిత్రాలు చేసిన ఘనత ఈయనదే. సంగీత రంగంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సౌందర్యన్‌కు ప్రత్యేకంగా గురువంటూ ఎవరూ లేరట. బికామ్ పట్టభద్రుడయిన ఈయన సంగీతంపై ఆసక్తితో జగదీష్ అనే సంగీత మాస్టారు వద్ద గిటార్ నేర్చుకున్నారు. అలా సంగీత జ్ఞానాన్ని పెంపొందిచుకున్న సౌందర్యన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ దష్టిలో పడ్డారు. ఆయన ద్వారా చేరన్‌పాండియన్ చిత్రంతో సంగీతదర్శకులయ్యారు. కుంజుమోన్ నిర్మించిన సింధూనదిపూ వంటి పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగు, ఒరియా చిత్రాలకు సంగీతాన్ని అందించడం విశేషం.
ఇటీవల ఈయన సంగీతం అందించిన నదిగళ్ ననైవదిలై ్ల చిత్రంలోని పాటలకు సంగీత ప్రియుల ఆదరణతో పాటు పరిశ్రమ నుంచీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందంటున్నారు ఈయన. తన 42 చిత్రాలలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినా నదిగళ్ ననైవదిలై ్ల లోని పాటలు తనకు సంతప్తినిచ్చాయన్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వద్ద పని చేయకపోయినా తనకు స్ఫూర్తి ఆయనే అంటున్న సౌందర్యన్ ప్రస్తుతం ఒళిచిత్రం, ననైయాదమళై, ఎన్నంపుదువన్నం తదితర చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాను రూపొందించిన సహస్ర గీతాలు బయట ప్రపంచంలో మారుమ్రోగాలన్నదే తన లక్ష్యం అంటారు ఈయన..