రాజీనామా చేయాల్సిందే... | must and Should be resign | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయాల్సిందే...

Published Fri, Jul 3 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

రాజీనామా చేయాల్సిందే...

రాజీనామా చేయాల్సిందే...

లోకాయుక్త రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్
రాజ్‌భవన్‌నూ తాకిన సెగ
గవర్నర్‌పై ఆప్ మండిపాటు
 

బెంగళూరు: లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతమవుతోంది. ఆయన కుమారుడు అశ్విన్‌రావ్ లోకాయుక్త అధికారులను బెదిరించి డబ్బు వసూలుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త భాస్కర్‌రావు సైతం అవినీతి కార్యకలాపాలకు మద్దతుగా నిలిచారని అందువల్ల ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర న్యాయవాదులతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. లోకాయుక్త తన పదవికి రాజీనామా చేయాలని అటు చట్టసభల్లో విపక్షాలు పట్టుపడుతుండగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు లోకాయుక్త కార్యాలయం, నివాసం ఎదుటే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇక లోకాయుక్త రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శాసనసభ సమావేశాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇక లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్ చేపట్టిన విచారణపై హైకోర్టు స్టే విధించడానికి కాసేపు ముందే ఆమె ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టర్ చేశారని, ఇందులో లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావు, కృష్ణారావు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ అశ్విన్‌రావు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలుస్తోంది. ఇదే   సందర్భంలో ఈ కేసు విచారణకు గాను జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కమల్‌పంత్ బృందం త్వరలోనే ఈ కేసు విచారణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
 రాజ్‌భవన్‌నూ తాకిన సెగ.....
.
 ఇక లోకాయుక్త పదవి నుంచి తప్పుకునేందుకు భాస్కర్‌రావు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆయన్ను తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సందర్భంలో లోకాయుక్తలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యకలాపాలు బయటపడుతున్నా గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా స్పందించకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మండిపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో గవర్నర్ కలగజేసుకోవాలని, అంతేకాక లోకాయుక్తను ఆ పదవి నుంచి తప్పించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఇక బీజేపీ ప్రతినిధుల బృందం సైతం ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఆప్తులతో భాస్కర్‌రావు సమాలోచనలు.....
ఇక లోకాయుక్త రాజీనామా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికపై లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు తన సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అశ్విన్‌రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో చట్టపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై సైతం భాస్కర్‌రావు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement