ముంబై/నాగపూర్: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పేర్లు ఓటర్ల జాబితానుంచి గల్లంతు కావడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో ఖండాంతర ఖ్యాతిగాంచిన పలువురు ప్రముఖుల పేర్లు సైతం ఉండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో 48 లోక్‌సభ స్థానాలకూ తిరిగి పోలింగ్ నిర్వహించాలని విదర్భ జన్ ఆందోళన్ సమితి డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు కోల్పోవడంపై ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పడంపై సమితి చీఫ్ కిషోర్ తివారీ స్పందించారు. ‘అధికారుల క్షమాపణలతో నష్టం పూడుకుపోదు.. దేశ పౌరుల ప్రాథమిక హక్కును హరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా అన్ని లోక్‌సభ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే’నని తివారీ డిమాండ్ చేశారు. ‘ఎన్నికల సంఘం చేసిన తప్పిదం 2014 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాల్లో గల్లంతయ్యాయని ఏప్రిల్ 19వ తేదీన మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలను క్షమాపణలు కోరింది. కాగా దీనిపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోబోమని, ముఖ్య ఎన్నికల కమిషనర్ వి.సి. సంపత్‌కు ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అయితే తర్వాత ఆయన స్వరం మార్చారు. ఓటర్ల పేర్లు జాబితాల్లో గల్లంతుపై పరోక్షంగా ప్రజలనే తప్పుబట్టారు. ఓటర్లు ముందుగానే ఓటర్ల లిస్టులో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. ‘ప్రజలు తమ రైలు, విమాన ప్రయాణ సమయంలో టికెట్ పరిస్థితిపై తప్పకుండా ఆరా తీస్తుంటారు. అలాంటిది ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు..’ అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల జాబితా నుంచి పేర్లు గల్లంతైన వారిలో హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్, ప్రముఖ న్యాయవాది రామ్ జెత్మలానీ, ముంబై స్టాక్ ఎక్ఛ్సేంజ్ చైర్మన్ అశిష్‌కుమార్ చౌహాన్, అద్మన్ భరత్ దభోల్కర్, నటులు అమోల్ పాలేకర్, అతుల్ కుల్‌కర్ణి వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది పేర్లు ఉండటం గమనార్హం. వీరి పేర్లను త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాబితాలో చేరుస్తామని బ్రహ్మ హామీ ఇచ్చారు. కాగా తివారీ మాట్లాడుతూ..‘ ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఏప్రిల్ 19న కథనాలు వెలువడిన వెంటనే బ్రహ్మ తగిన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చివరి విడత పోలింగ్‌లో సుమారు 20 లక్షలమంది తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలిగి ఉండేది..’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ..‘ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం పలు ఇబ్బందులకు కారణమవుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్ల పేర్ల నమోదు సమయంలో ప్రైవేట్ బీపీఓలతో పనులు చేయించుకుంటున్నారన్నారు. వారు డబ్బుకు అమ్ముడుపోయి కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేయడానికి వెనుకాడటంలేదని పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయమై తాము చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడంలేదని వాపోయారు.
ఈసీపై కేసు పెడతాం
ఓటర్ల జబితాలో నుంచి పేర్లు గల్లంతైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్నికల కమిషనర్ హెచ్.ఎం.బ్రహ్మపై కేసు పెడతామని పలువురు హెచ్చరించారు. అందరూ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని అనేక జనజాగృతి కార్యక్రమాలు చేపట్టింది. ఓటర్లను జాగృతపరిచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ప్రవేశపెట్టింది. అయితే జాబితా తయారీలో లోపం వల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. నగర పరిధిలో సుమారు 21 వేల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకురాలు మీరా సన్యాల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు మాటుంగాకు చెందిన ఉమేష్ పంచమాటియా అన్నారు. ఎన్నికల కమిషన్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓట్ల గల్లంతుపై అఖిలపక్షం
ముంబై: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లు గల్లంతుపై అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటుచేయాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని చెప్పారు. ఒకవైపు ఓటర్లకు పోలింగ్‌పై అవగాహన కల్పిస్తూనే మరోవైపు వారి పేర్లను జాబితాల నుంచి తొలగించడం సమర్థనీయం కాదన్నారు.
రీపోలింగ్ జరపాల్సిందే
Published Fri, Apr 25 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement