సాక్షి, ముంబై: ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్ర జనాభాతోపాటు ఓటర్ల జాబితా పెరిగింది. దీంతోపాటు పురుషులు, మహిళా ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం కూడా పెరగడం విశేషం. ముఖ్యంగా రాష్ట్ర జనాభాను పరిశీలించినట్టయితే ప్రతి 1000 మంది పురుషులకుగాను 925 మంది మహిళలున్నట్టు తెలుస్తోంది. అయితే ఓటర్ల జాబితాలో మాత్రం ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు కేవలం 884 మహిళ ఓటర్లు ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబరు ఒకటో తేదీ వరకు నిర్వహించిన విషయం విదితమే. దీంతో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7.62 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడయింది. అయితే అనేక మంది నకిలీపత్రాలు, చిరునామాలు, పేర్లతో ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేసుకున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది.
దీంతో 36.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.62 కోట్లుగా తేలింది. అయితే ఈ ఓటర్లలో పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.05 కోట్ల మంది పురుష, 3.57 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తేలింది. ప్రతి 1000 మంది పురుషులకుగాను 884 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ సంఖ్య గతంలో కంటే కూడా తక్కువ కావడం విశేషం. ఐదేళ్ల కిందటి ఓటరు జాబితాను పరిశీలించినట్టయితే ప్రతి 1000 మంది పురుషులకు గాను 891 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఆడపిల్లలు వద్దనుకునేవారు ఇంకా ఉండడంతోపాటు, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోకపోవడం తదితర కారణాల వల్ల సంఖ్య తగ్గిఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలించినట్టయితే భోసరీలో అత్యధిక వ్యత్యాసం ఉంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే చాలా తక్కువగా ఉంది. మరోవైపు పురుషులు, మహిళ ఓటర్లలో అత్యల్ప వ్యత్యాసం చంద్రాపూర్ జిల్లా వరోరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఓటర్ల జాబితాలో భారీ తేడాలు!
Published Wed, Nov 6 2013 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement