సాక్షి, ముంబై: తొలిసారిగా వినియోగంలోకి వచ్చిన ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (నోటా) మీటా బటన్‌ను లక్షలాది మంది వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం అందించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,23,180 మంది ఓటర్లు ఈ నోటా మీటాను వినియోగించుకున్నారు. రాజకీయ నేతలపై ఉన్న అసంతృప్తిని చూపించారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో అత్యధికంగా 24,488 మంది గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నోటామీటాను వినియోగించి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
అత్యల్పంగా బీడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 2,323 మంది ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనేక మంది ప్రజలు ఈ మీటా కారణంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తోంది. గతంలో ఈ మీటా అందుబాటులోకి రాకముందు అభ్యర్థులపై అసంతృప్తిగా ఉండే వీరు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఓటు హక్కు వినియోగించడమే మానేశారు. అయితే ఈ మీటా అందుబాటులోకి రావడంతో వీరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుపడింది.
నాలుగు నియోజకవర్గాల్లో 20వేలమందికిపైగా ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. 13 నియోజకవర్గాల్లో 10 వేల నుంచి 20 వేల వరకు ఓటర్లు నోటా బటన్‌ను నొక్కారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె పోటీ చేసిన పవార్ కుటుంబీకులకు పెట్టనికోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 14,216 మంది ఈ నోటా మీటాను నొక్కారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పోటీ చేసిన షోలాపూర్‌లో 13,778 మంది ఓటర్లు నోటా నొక్కి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
నాలుగు లక్షల మంది నోటా నొక్కారు
Published Sun, May 18 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement