విదేశీ యువతితో లోకేశ్(ఫైల్)
‘సాక్షి’ మూడే ప్రచురించింది
విదేశీ యువతులతో ఫొటోలపై స్పందించిన లోకేశ్
20 రోజులు దేశమంతా తిరిగినట్లు వెల్లడి
సెల్ఫీలు దిగితే తప్పేంటని ప్రశ్న
అనంతపురం టౌన్: సెల్ఫీలు దిగితే తప్పా? సెల్ఫీలు దిగేటప్పుడు యువకులుగా మనం ఫేస్‌లు విచిత్రంగా పెట్టమా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 2006లో స్టాన్ ఫర్డ్ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో ఐదారొందల ఫొటోలు దిగానని, అయితే అందులోంచి మూడు ఫొటోలే ’సాక్షి’ పత్రికలో వేశారని అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ’ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువత పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ’మీరు ఫారిన్ గర్ల్ల్స్తో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. అది నిజమా?’ అని సునీల్ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేశ్ పైవిధంగా స్పందించారు.
మరో ఐదుసార్లు చంద్రబాబే సీఎం!
ఏపీకి హోదా వల్ల ఉద్యోగాలు రావని, ప్రత్యేక రాయితీలతోనే అవి సాధ్యమని లోకే‹శ్అన్నారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అనంతపురం జిల్లాకు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌ను తెస్తామన్నారు. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. మరో ఐదుసార్లు చంద్రబాబే రాష్ట్రానికి సీఎంగా ఉంటారన్నారు. బాబుకు అండగా ఉంటారో.. జగన్ తో నిలబడతారో ఆలోచించుకోవాలన్నారు.
‘సాక్షి’ దినపత్రికపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. పార్టీ శిక్షణ కార్యక్రమంలో తాను హోంమంత్రి చినరాజప్పతో మాట్లాడుతుంటే ఆ ఫొటోను పెద్దదిగా చేసి నిలదీస్తున్నట్లు వార్త రాశారని ఆరోపించారు. దేవాన్ష్ పేరుతో రూ.19 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. తర్వాత జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి లోకేష్ హాజరయ్యారు.
ఎమ్మెల్సీ తిప్పేస్వామికి అవమానం
టీడీపీ బీమా లబ్ధిదారులతో భేటీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ తిప్పేస్వామికి అవమానం ఎదురైంది. భవ నంపై అంతస్తులోకి వెళ్లకుండా గేట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు అక్కడకు వచ్చి తిప్పేస్వామిని లోపలికి తీసుకెళ్లారు.