
ఏ క్షణమైనా ఉగ్రదాడులు..!
దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత
♦ సరిహద్దు పరిస్థితిపై రాజ్‌నాథ్ ఆధ్వర్యంలోసమీక్ష
♦ కీలక ప్రాంతాలు, వైమానిక స్థావరాల వద్ద హైఅలర్ట్
♦ భద్రతా దళాలు, ప్రజలే ఉగ్రవాదుల లక్ష్యం: నిఘా వర్గాలు
♦ రాష్ట్రాల్ని హెచ్చరించిన కేంద్ర హోం శాఖ
♦ సర్జికల్ దాడుల్లో మన సైనికులు మరణించలేదన్న ఆర్మీ
పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేయవచ్చు... ఎక్కడైనా విరుచుకుపడవచ్చు...! కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల తాజా హెచ్చరిక ఇది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు... భద్రతా దళాల్ని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చని, వారు ఇప్పటికే కశ్మీర్‌లో మకాం వేశారంటూ నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి. దీంతో సరిహద్దు వెంట ఉన్న భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతాధికారులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేయవచ్చు... ఎక్కడైనా విరుచుపడవచ్చు...! కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల తాజా హెచ్చరిక ఇది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు.ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు... భద్రతా దళాల్ని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చని, ఇప్పటికే కశ్మీర్‌లో మకాం వేశారంటూ నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి.
దీంతో సరిహద్దు వెంట ఉన్న భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతాధికారులను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. భారత్- పాక్ సరిహద్దుల్లో పరిస్థితితో పాటు దేశవ్యాప్తంగా భద్రతను ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రత్యేక భేటీలో ఆయన సమీక్షించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు తీసుకున్న చర్యలు, సరిహద్దుల్లో ప్రజల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తల్ని వారు వివరించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి ఇతర భద్రతా, నిఘా అధికారులు పాల్గొన్నారు.
నిఘా పెంచాలంటూ ఐబీకి ఆదేశాలు
బీఎస్‌ఎఫ్.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో అన్ని యూనిట్లను అత్యంత అప్రమత్తంగా ఉంచింది. జమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌ల్లో నిఘాను పెంచాలని ఐబీకి హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్‌లో ఉన్న సిబ్బందినీ వినియోగించుకోవాలని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల కదలికల్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్న బీఎస్‌ఎఫ్... వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా సాయం చేస్తోంది.
పంజాబ్‌లో భారీ భద్రత
పంజాబ్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వైమానిక స్థావరాల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు భాక్రా డ్యాం వద్ద పహారా పెంచారు. అన్ని ఆనకట్టల వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పునరావాస కేంద్రాలకు 1000 గ్రామాల ప్రజలు
పంజాబ్ రాష్ట్రం పాక్‌తో 553 కి.మి. సరిహద్దు కలిగి ఉంది. మొత్తం ఆరు జిల్లాలు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని 1000 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారి కోసం జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. స్కూళ్లు, కల్యాణ మండపాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు.
గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల పరిధిలోని గ్రామాల్లో పలు శిబిరాల్ని ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. గురువారం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కేబినెట్ భేటీ నిర్వహించి సరిహద్దు జిల్లాలకు అత్యవసర ఖర్చుల కోసం తక్షణం రూ. కోటి చొప్పున విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: హోం శాఖ
రాష్ట్రాల్లోని సున్నిత, వ్యూహాత్మక ప్రాంతాలు, మార్కెట్లు, మత సంబంధ ప్రదేశాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాల్ని నియమించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. రాబోయే పండుగల దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలంది. మెట్రో నగరాల్లో నిఘా పటిష్టం చేయాలని కోరింది. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. పీఓకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ భద్రత వర్గాలు ఉగ్రవాద గ్రూపుల్ని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే గురువారం నాటి దాడితో ఎల్‌ఓసీ వెంట ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని పీఓకేలో గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
భారత సైనికులెవరూ మరణించలేదు: ఆర్మీ
భారత్ సర్జికల్ దాడుల సందర్భంగా భారతీయ సైనికులు మరణించారన్న వార్తల్ని ఆర్మీ తోసిపుచ్చింది. ప్రత్యేక బృందానికి చెందిన ఒక సభ్యుడు స్వల్పంగా గాయపడ్డాడని, శత్రువులు, ఉగ్రవాదుల దాడి వల్ల అతను గాయపడలేదని ఆర్మీ పేర్కొంది. ఈ ఆపరేషన్ అత్యంత పకడ్బందీగా నిరంతర పర్యవేక్షణతో జరిగిందని, ఏడు ఉగ్ర స్థావరాలపై ఒకేసారి దాడులు నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ పోస్టుల్లో కాపలా కాస్తోన్న పాక్ భద్రతా దళాల దృష్టిని మళ్లించేందుకు ఎల్‌ఓసీ వెంట భారత వైపు ఉన్న పలు సెక్టార్లపై హెలికాప్టర్లతో గస్తీ నిర్వహించారని పేర్కొన్నాయి.
మనవడ్ని తలచుకుంటూ.. ఆగిన గుండె
సాక్షి, ముంబై: తన మనవణ్ని పాక్ సైన్యం పట్టుకుందన్న వార్తతో జవాన్ చందు బాబూలాల్ చవాన్(22) నానమ్మ గుండెపోటుతో మరణించారు. చందు స్వస్థలం మహారాష్ట్రలోని ధుళే జిల్లా బోర్విహిర్‌లో తీవ్ర విషాదం అలముకుంది. చందు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ లీలాబాయి పాటిల్ అన్నీ తానై పెంచింది. అతని సోదరుడూ గుజరాత్‌లోని ‘9-మరాఠ రెజిమెంట్’ లో పనిచేస్తున్నాడు. ఇటీవల కశ్మీర్ అల్లర్లు నేపథ్యంలో సరిహద్దులో గాలిస్తూ చందు నియంత్రణ రేఖ దాటి పీవోకేలోకి వెళ్లాడు. దీంతో అతన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. విషయం గురువారం అర్థరాత్రి లీలాబాయికి తెలియగానే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూసింది. విషయం తెలుసుకునే గ్రామస్తులంతా కంటతడి పెట్టారు.
వీలైనంత తర్వగా విడిపిస్తాం.. రాజ్‌నాథ్: చందును సురక్షితంగా విడిపించేందుకు భారత్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అతను తొందరగా విడుదలయ్యేందుకు పాకిస్తాన్‌ను సంప్రదిస్తామని చెప్పారు. భారత సైనికుడు బందీగా ఉన్నాడన్న విషయాన్ని ఇప్పటికే డీజీఎంఓ పాకిస్తాన్‌ను తెలిపారు.
భారత్ దాడులు ఆత్మరక్షణకే: అఫ్గాన్
న్యూఢిల్లీ/బీజింగ్: పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడులను అఫ్గానిస్తాన్ సమర్థించింది. ‘ఆత్మరక్షణ కోసమే వీటిని నిర్వహించారని భారత్‌లోని అఫ్గాన్ రాయబారి అబ్దాలీ అన్నారు. ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అని పాక్‌ను హెచ్చరించారు. మరోవైపు.. ఉగ్రవాదంపై భారత వైఖరిని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయె హే కూడా సమర్థించారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. పార్క్‌తో భేటీలో దాడుల గురించి వివరించారు.
కళ్లెం వేయండి: రష్యా
పాక్‌లోని ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఆ దేశం గట్టి చర్యలు తీసుకోవాలని రష్యా కోరింది. భారత్-పాక్ సరిహద్దు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఉద్రిక్తత నివారించి, చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
సంయమనం పాటించాలి: చైనా
భారత్, పాక్‌లు సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి చేసింది. ‘పొరుగున ఉన్న మిత్రదేశంగా తాజా ఘర్షణపై ఆందోళన పడుతున్నాం. ఇరు పక్షాలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి’ అని చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షూంగ్ శుక్రవారం అన్నారు.