
నయనతారకు భంగపాటు
నటి నయనతారకు భంగపాటు తప్పలేదు. అదీ వందలాదిమంది నడయూడే విమానాశ్రయంలో. అక్కడ ఆమె స్టార్‌డమ్ ఏ మాత్రం పని చేయలేదు. అసలు విషయం ఏమిటంటే సూర్య సరసన మాస్, జయం రవికి జంటగా తనీ ఒరువన్, విజయ్ సేతుపతితో నానుం రౌడీదాన్ తదితర చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వున్న ఈ బ్యూటీ క్రిస్మస్ వేడుకలను స్వగృహంలో జరుపుకోవాలనే ఆకాంక్షతో బుధవారం హడావుడిగా చెన్నై నుంచి కొచ్చికి బయలుదేరారు. అయితే ఈ అమ్మడికి చాలా బిజీ షెడ్యూల్ కదా చెన్నై విమానాశ్రయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు.
అంటే ఉదయం 10.30 గంటలకు ప్లైట్‌కు 10 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. పాపం నయనతార బయలుదేరింది పండుగ వేడుకకు కదా! కాస్త భారీ లగేజీతో వెళ్లారు. భారీ అంటే కేవలం ఐదు సూటుకేసులే. అయితే ఆ లగేజీతోనే వచ్చింది తంటా. ఆమె ఆలస్యంగా వెళ్లడంతో విమానాశ్రయ అధికారులు మీరు వెళ్లవచ్చు. కానీ మీ ఐదుసూట్‌కేసుల లగేజీని తీసుకెళ్లడానికి కాలవ్యవధి ముగిసిపోయిందని ఖరాఖండిగా చె ప్పేశారు. అక్కడికి నయనతార సాధ్యమైనంతవరకు చాలా సౌమ్యంగా వారిని అభ్యర్థించారు.
అయినా ఫలితం లేకపోయింది. అక్కడి అధికారులు మాత్రం మీరు సింగిల్ బ్యాగ్‌తో వెళ్లడానికి మాత్రం అనుమతిస్తాం ఐదు సూట్ కేసులకు మాత్రం పర్మిషన్ ఇచ్చేది లేదంటూ నిరాకరించడంతో చాలా భంగపాటుకు గురైన నయనతార చివరికి తన సూట్‌కేసులను కారులోనే వదిలేసి సింగిల్ హ్యాండ్‌బ్యాగ్‌తో కొచ్చికి వెళ్లాల్సి వచ్చింది. నయనతార వ్యవహారం చెన్నై విమానాశ్రయంలో కలకలం సృష్టించింది.