అక్రమకట్టడాలను క్రమబద్ధీకరించే విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వైఖరీపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది.
సాక్షి, ముంబై: అక్రమకట్టడాలను క్రమబద్ధీకరించే విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వైఖరీపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. నాగపూర్‌లో జరగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ముంబై, ఠాణే, పుణే, నాసిక్ ఇలా అనేక నగరాల్లోని మూడు కోట్ల ప్రజలకు మేలు జరిగే కట్టడాల క్రమబద్ధీకరణ అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బాధిత ప్రజలందరికీ న్యాయం చేయాలని, అందుకుగా అవసరమైతే చట్టంలో సవరణ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలు కోరడం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై ఎలాంటి వైఖరీ చెప్పకుండా దాటవేస్తున్నారని మాలిక్ ఆరోపించారు. ఇటీవలే పింప్రి-చించ్‌వాడ్, పుణేలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం నలుగురు ఎమ్మెల్యేలతోపాటు అనేక మంది ఎన్సీపీ కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎన్సీపీ హెచ్చరించింది.