ముంబై: బాలీవుడ్‌ను మహరాష్ట్ర నుంచి తరిమేసేందుకే బీజేపీ కుట్రపూరితంగా డ్రగ్స్ కేసును వాడుకుంటోందని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈ చర్యలతో బాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ ఓ ప్లానింగ్‌తో చేస్తున్న కుట్ర అని మాలిక్ విలేకరుల సమావేశంలో అన్నారు. తన మాటలకు బలం చేకూర్చేలా..నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినీ ప్రముఖులతో జరిపిన సమావేశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రస్తుతం కేసుకు సంబంధించి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లిన కిరణ్ గోసావి కటకటాల వెనుక ఉన్నాడు. డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని 2018 చీటింగ్ కేసుకు సంబంధించి పుణె పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే రక్షణ కావాలిన బాంబే హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు.
వాంఖడేకు మూడు రోజుల నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయబోమని ముంబై పోలీసులు హైకోర్టుకు హామీ ఇచ్చారు. సమీర్ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాంఖడే తన గొంతును అణచివేయడానికి ప్రయత్నించాడన్న మాలిక్.. తన ఆరోపణలన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎట్టికేలకు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు నిందితులకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు
Comments
Please login to add a commentAdd a comment