రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు
న్యూఢిల్లీ: పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల బరిలోకి దిగడంద్వారా రాజకీయ రంగంలోకి తాను ప్రవేశిస్తానని అనుకోలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతిపరులైన కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియాకు చెందిన మరికొందరు సంతోషంగా బతుకుతున్నారని, అయితే సామాన్యుడు మాత్రం ఇంకా బాధల్లోనే ఉన్నాడని అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే విషయమై మాట్లాడుతూ ఇది వారిలో అరాచకానికి తెరతీస్తోందన్నారు. అటువంటివారికి తాను అరాచకవాదినేనన్నారు. అంతేకాకుండా తనను తాను రాజకీయ విప్లవకారుడిగా ఆయన అభివర్ణించుకున్నారు. మిమ్మల్ని నియంత అని పిలిచేవారి విషయంలో ఏవిధంగా స్పందిస్తారని అడగ్గా... అలా అయితే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌వంటివారు తనతో ఏవిధంగా పనిచేయగలుగుతారని ఆయన ఎదురుప్రశ్నించారు. ఆప్ నాయకులంతా కలసికట్టుగా ఉంటారని, ఒకవేళ తాము నియంతలమే అయితే తమ పక్కన నలుగురు కూడా నిలబడలేరన్నారు. 2012, అక్టోబర్‌లో ఆప్ పార్టీని చేశానన్నారు. ఎన్నికల బరిలోకి దిగితే మంచి ఫలితాలు వస్తాయని అనుకున్నానని, అయితే ముఖ్యమంత్రినవుతానని మాత్రం ఊహించలేదన్నారు.
పీఎం కావాలనుకోవడం లేదు
ప్రధానమంత్రి అవుదామని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. భారత్‌ను అవినీతిరహిత దేశంగా మార్చాలనేదే తన కోరికని అన్నారు. అందుకోసమే తాము పోరాడుతున్నామన్నారు. అంతేతప్ప అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు. భవిష్యుత్తలో ప్రధాని అవుతారా అని ప్రశ్నించగా మున్ముందు ఏమిజరుగుతుందనే విషయం ఎవరికి తెలుసన్నారు. అయితే లోక్‌సభకు పోటీ చేస్తానా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు బరిలోకి దిగిన ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు.
వారినుంచి ఏమీ ఆశించలేం కేంద్రంలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తాము చెప్పడం లేదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్‌గాంధీల గురించి మాట్లాడుతూ వారిరువురూ రాజకీయ వ్యవస్థలో భాగమని మాత్రం చెప్పగలనన్నారు. అయితే వారినుంచి ఏమీ ఆశించలేమన్నారు.
‘ప్రత్యామ్నాయం చూసుకుంటాం
‘ఆరోగ్యకర వాతావరణంతో ముందుకెళ్తే ఫర్వాలేదు. లేదంటే ప్రత్యామ్యాయం చూసుకుంటామని సీఎం అరవింద్ కుమార్ కేజ్రీవాల్ విద్యుత్ పంపిణీ సంస్థలకు చురకలంటించారు. విద్యుత్ కంపెనీలకు గడ్డుకాలం ఉందని, విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రభుత్వంపై లా కంపెనీలు ఒత్తిడి తేవడంతో ఆయన పైవిధంగా స్పందించారు. అనిల్ పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వానికి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని పేర్కొన్నారు. అనిల్, టాటాలు ఎవరైనా నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. విద్యుత్ విషయంలో వారు గందరగోళం సృష్టిస్తే తాము ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఒప్పుకోబోమన్నారు. ‘ప్రజలకు విద్యుత్ అవసరం తప్పనిసరి. అయితే విద్యుత్ భారాన్ని వారు అంగీకరించరు’ అని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచితే వారు ఆందోళనకు దిగుతారన్నారు. గత ప్రభుత్వంపై ఇలాంటి ఆందోళననే జరిగిందన్నారు. ఢిల్లీకి అనిల్ అంబానీ గ్రూప్, రాజధాని పవర్, యమున పవర్‌ల నుంచి దాదాపు 70 శాతం విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. అయితే నిజాయితీ వ్యాపారులతోనే తాము సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
సంబంధాలు తెంచుకోవాలనుకోవడంలేదు
విద్యుత్ సంస్థలతో ప్రస్తుతానికైతే సంబంధాలు తెంచుకోవాలనుకోవడంలేదని సీఎం అరవింద్‌కుమార్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ సంస్థలు ససేమిరా అంటే ఏం చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. తమను ఒత్తిడి చేయకుండా 10 గంటల విద్యుత్ కోతలు విధిస్తే దానికి తగిన డబ్బులను ఇవ్వాలని పేర్కొన్నారు. లెసైన్స్‌లు కొనసాగాలంటే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సంస్థల యజమానులు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే తాము అంతకుమంచి సంస్థలను చూసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వారి లెసైన్సులను తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు గత సోమవారం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో విద్యుత్ ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉత్తర్వులు తమకే అనుకూలంగా ఉన్నాయని, ఏం జరుగుతుందో వేచిచూద్దామని ఆయన పేర్కొన్నారు.