నేడు అధికారిక ప్రకటన
నలుగురు అధికారుల పేర్లను సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ
బెంగళూరు : నూతన డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హోంగార్డ్స్, అగ్నిమాపక శాఖకు డీజీపీ-ఐజీపీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత డీజీపీ లాల్‌రుఖుమ్ పచావో పదవీకాలం నేటి(శనివారం)తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం శనివారం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డీజీపీ రేస్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు రూప్ కుమార్ దత్త, సుశాంత్ మహాపాత్ర, ఓం ప్రకాష్ ల మధ్య గట్టి పోటీనే ఏర్పడింది.
వీరిలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రూప్‌కుమార్ దత్తను కొత్త పోలీస్ బాస్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మొగ్గు చూపింది. అంతేకాక ముఖ్యమంత్రి అధ్యక్షతన, రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్, సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ ఎక్కువ మంది పోలీసు అధికారులు డీజీపీ పదవికి రూప్‌కుమార్ దత్త పేరునే సూచించారు. అయితే అనంతరం అనూహ్యంగా ఓం ప్రకాష్ సైతం డీజీపీ రేస్‌లో ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం డీజీపీ పదవికి గాను ఓం ప్రకాష్ పేరే వినిపిస్తోంది. డీజీపీగా ఓం ప్రకాష్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేయడం మాత్రమే మిగిలి ఉంది. కాగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్‌కు నిజాయితీ గల అధికారిగా పోలీసు వర్గాల్లో పేరుంది. స్వతహాగా బీహార్‌కు చెందిన ఓం ప్రకాష్ 1981లో ఐపీఎస్ పూర్తిచేసి కర్ణాటక కేడర్‌లో స్థిరపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఓం ప్రకాష్ అనేక విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
నలుగురు అధికారుల పేర్లు సిఫార్సు.....
ఇక నూతన డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీతో పాటు సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమితి శుక్రవారమిక్కడి విధానసౌధలో సమావేశమైంది. డీజీపీ రేస్‌లో ఉన్న అధికారుల శక్తి, సామర్థ్యాలు, వారి సీనియారిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న సమితి మొత్తం నలుగురు ఐపీఎస్ అధికారులను డీజీపీ నియామకానికి గాను సిఫార్సు చేసింది. వీరిలో ఓం ప్రకాష్, రూప్‌కుమార్ దత్త, సుశాంత్ మహాపాత్ర, బిపిన్ గోపాలకృష్ణలు ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ మాట్లాడుతూ....డీజీపీ నియామకానికి సంబంధించి మొత్తం నలుగురు అధికారుల పేర్లను సిఫార్సు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పంపుతున్నామని, ఈ నలుగురిలో ఒకరిని డీజీపీగా నియమిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
నూతన డీజీపీగా ఓం ప్రకాష్ !
Published Sat, Feb 28 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement