* అగ్నిమాపక సిబ్బంది ఆగ్రహం
* ఎనిమిది ఏళ్లుగా ఏదీ శిక్షణ
* పాములతో నిరంతర భయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యవసర సమయాల్లో ఆదుకునే అగ్నిమాపక సిబ్బందే ఆపదలో ఉన్నారు. వృత్తిపరమైన శిక్షణకు నోచుకుండానే విధులు నిర్వహిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో చెన్నై, వేలూరు, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురైలో అగ్నిమాపకశాఖకు సంబంధించి ప్రధాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ ఐదు ప్రధాన కేంద్రాల అజమాయిషీ కింద 302 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. హొగెనకల్, కొత్తగిరిల్లో మరో రెండు ప్రత్యేకవిభాగాలు ఉన్నాయి.
అన్నింటిలో కలిపి వేలాది మంది అగ్నిమాపక సహాయ సిబ్బంది పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, నిర్మాణాలు కూలిపోయినపుడు వీరే సహాయక చర్యలు చేపడతారు. చెరువులు, నీటిగుంతల్లో పడిపోయిన వారి ప్రాణాలను రక్షించడం కూడా వీరి బాధ్యతే. ఈ పనులు నిర్వర్తించేందుకు ప్రారంభదశలోనే సిబ్బందికి మూడు నెలల పాటు శిక్షణను ఇవ్వాల్సి ఉంది. అంతేగాక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారిలోని నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు అధునాతన శిక్షణ ఇవ్వాలి. ఈ రకమైన శిక్షణలో పాములు పట్టుకునే విధానం అత్యంత ప్రధానమైనది. వివిధ సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందికి ఒక్కోసారి విషసర్పాలు ఎదురవుతాయి. ఆ పాములను ఒడిసి పట్టుకునేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
2005 తరువాత అగ్నిమాపక సిబ్బంది పాములను పట్టే శిక్షణకు నోచుకోలేదు. శిక్షణ పొందలేదు కదా అని రక్షణ చర్యలకు దూరంగా ఉండలేక పోతున్నారు. శిక్షణ పొందకుండానే 8 ఏళ్లుగా ప్రాణాలకు తెగించి పాములు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పోత్తేరీలోని ఒక ప్రయివేటు కళాశాలలోకి పాము జొరబడింది. అగ్నిమాపక శాఖకు చెందిన నేశగుహన్ (27) పామును పట్టుకునే ప్రయత్నం చేయగా కాటువేసింది. హడావుడిగా అతన్ని ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడారు. శిక్షణకు నోచుకోకుండా విధులు నిర్వర్తించడం వల్లనే ఇటువంటి విపరీతాలు చోటుచేసుకుంటున్నాయని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందికి శిక్షణపై తిరునెల్వేలీకి చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ, కొత్తగా విధుల్లో చేరేపుడు ఇచ్చే శిక్షణే అత్యంత సాధారణంగా సాగుతోంది. మూడునెలల పాటూ ఇచ్చే శిక్షణను మొక్కుబడిగా పూర్తిచేస్తున్నారు. ఈ శిక్షణలో పాములు పట్టే విధానంపై ఎటువంటి మెళకువలను నేర్పడం లేదు. ఇతర శిక్షణ కంటే పాములు పట్టే విషయంలో ప్రత్యేక శిక్షణ, జాగ్రత్తలు, వాడాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే 8 ఏళ్లుగా ఉన్నతాధికారులు ఈ విషయాన్నే పక్కనపెట్టేశారు.
సహాయక చర్యలకు పోయినపుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను ఆదుకునేది సిబ్బందే. అరుుతే వారు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను ఎన్నో సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అంతేకాదు, నీటిలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించేందుకు ఈతలో శిక్షణనిచ్చి సరిపుచ్చుతున్నారు. నీటి అడుగు భాగంలోకి వెళ్లాలంటే మాస్కులు, ఆక్సిజన్ అవసరం. ఇవేమీ సరఫరా చేయడం లేదు. ఆపదలో ఉన్న ర క్షించే వారికే రక్షణ కరువైపోవడంతో వారు దినదినగండంగా బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
శిక్షణపై ‘ఫైర్’
Published Tue, Nov 11 2014 2:50 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM
Advertisement
Advertisement