కొత్త ఏడాదిలో ‘మెట్రో’
Published Wed, Dec 11 2013 2:52 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
సాక్షి, చెన్నై:నగరంలో మరో రెండు మార్గా ల్లో మెట్రో రైలు పనులు చేపట్టబోతున్నారు. ఇప్పటికే చేపడుతున్న రెండు మార్గాల్లో కొత్త ఏడాదిలో రైలు పట్టాలెక్కనుంది. దీంతోపాటు నగర శివారుల్ని కలుపుతూ కొత్త మార్గాల పనులకు ప్రతిపాదన సిద్ధం అయింది. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే రీతిలో మెట్రో రైలు ప్రాజెక్టును సుమారు 15 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కి.మీ దూరం ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కి.మీ మరో మార్గం లో మెట్రో రైలు సేవలకు నిర్ణయిం చారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెంట్రల్ - కోయంబేడు- మౌంట్ మార్గంలో వం తెనల నిర్మాణం పూర్తి అయింది. ట్రాక్ పనులు వేగవంతం చేశారు. భూగర్భ మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాలుగు బోగీలతో కూడిన నాలుగు మెట్రో రైళ్లను ఇటీవల బ్రెజిల్ నుంచి చెన్నైకు తీసుకొచ్చారు. పట్టాలు ఎక్కించి ట్రైల్ రన్‌ను విజయవంతం చేశారు. కొత్త ఏడాదిలో కోయంబేడు మార్గంలో మెట్రో రైలు పరుగులు తీయడానికి కావాల్సిన చర్యలు వేగవంతం చేశారు.
మరో రెండు మార్గాలు : నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే రీతిలో మెట్రో రైలు సేవలకు తొలి విడతలో నిర్ణయం తీసుకున్నారు. మలి విడతగా నగరం విస్తరిస్తుండటం శివారుల నుంచి నగరంలోకి ప్రతి రోజు జనం తరలి వస్తుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. నగర శివారువాసులకు మెట్రో రైలు సేవలను అందించే విధంగా మరో రెండు మార్గాల్లో పనులు చేపట్టనుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న రెండు మార్గాల పనులను వివరించి, మరో రెండు మార్గాల ఏర్పాటు అవశ్యం, అందుకు తగ్గ వివరాలతో ప్రతిపాదనను సిద్ధం చేసింది. నివేదిక రూపంలో కేంద్ర నగరాభివృద్ధి శాఖకు ప్రతిపాదనను పంపించారు. ఢిల్లీలో మరో రెండు మార్గాల పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో, చెన్నైలో మరో రెండు మార్గాల పనులకు కేంద్రం పచ్చ జెండా ఊపే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా వడపళని, కోడంబాక్కం, మైలాపూర్, అడయార్ పరిసరాల్ని కలుపుతూ తిరువాన్మీయూర్ వరకు 20 కి.మీ దూరంలో మూడో మార్గం ఏర్పాటుకు నిర్ణయించారు.
Advertisement