ఏ విచారణకైనా సిద్ధం: శశికళ
చెన్నై: జయలలిత మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని అన్నా డీఎంకే చీఫ్ శశికళ ప్రకటించారు. అమ్మ మరణాన్ని రాజకీయం చేయడం తనను బాధిస్తోందని అన్నారు. తాను ఎలాంటి వ్యక్తినన్న విషయం అమ్మకు తెలుసని, ఆమెను ఎలా చూసుకున్నానో తెలుసని, అమ్మను కంటికి రెప్పలా ఎలా చూసుకున్నానో డాక్టర్లకు కూడా తెలుసని చెప్పారు. జయలలిత మృతిపై విచారణకు ఏ కమిషన్ వేసినా తనకు సమస్య లేదని శశికళ చెప్పారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను కలిసేందుకు తనను అనుమతించలేదని, ఆమె మృతిపై విచారణ జరిపించాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన ఆరోపణలపై శశికళ ఓ ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు.
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యంగాన్ని కాపాడుతారని భావిస్తున్నానని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి తనను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు శశికళ చెప్పారు. గవర్నర్ను కలిసేందుకు ప్రయత్నించామని, ఆయన ఊటిలో ఉండటంతో సాధ్యం కాలేదని చెప్పారు. పన్నీరు సెల్వం చేసిన ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదని, తాను ఎలాంటి వ్యక్తి అన్న విషయం అమ్మకు తెలుసునని శశికళ చెప్పారు. పన్నీరు సెల్వం చర్యలు అమ్మ ఆశయాలకు విఘాతమని, డీఎంకే ఆయనను సొంత మనిషిని చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.