
ముంబై.. ‘నో ఫ్లయింగ్ జోన్’
- ‘లోకల్ రైళ్ల పేలుళ్ల’కు 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పోలీసు శాఖ నిర్ణయం
- బీఏఆర్సీ ఘటనతో నగరవ్యాప్తంగా అప్రమత్తం
- ఆగస్టు 4 వరకు ఆంక్షలు కొనసాగింపు
సాక్షి, ముంబై: తాజాగా బీఏఆర్సీలో డ్రోన్ ఘటన, 2006 జూలై 6 వరస బాంబు పేలుళ్లకు 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉగ్రదాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (కేంద్ర నిఘా సంస్థ) హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. నెల రోజులపాటు ముంబైని ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే డ్రోన్‌లు, విమానాలు, హెలికాప్టర్లు, పారా గ్లైడింగ్ తదితరాలపై నిషేధం విధించింది. రెండు రోజుల కిందట ముంబై (ట్రాంబే) లోని బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ (బీఏఆర్సీ) పరిసరాల్లో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు డ్రోన్ ప్రయోగించి బీఏఆర్సీ ఫొటోలు తీసుకుని కారులో వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని గుర్తించిన బీఏఆర్సీ అధికారులు కారు నంబరుతోసహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. డ్రోన్, పారా గ్లైడింగ్ ద్వారా ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందన్న నిఘా సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీ వరకు ముంబైని నో ఫ్లయింగ్ జోన్ పోలీసు శాఖ ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ అత్యవసరమైతే పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని డ్రోన్, పారా గ్లైడింగ్ ప్రయోగించవచ్చని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ బార్కుండ్ తెలిపారు.
11/7 దుర్ఘటనకు తొమ్మిదేళ్లు
2006 జూలై 11న (11/7) కేవలం ఎనిమిది నిమిషాల్లో ఏడు లోకల్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 188 మంది ప్రయాణికులు చనిపోగా, 847 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పరాగ్ సావంత్ ఒకరు. తొమ్మిది ఏళ్లుగా కోమాలో ఉండి వృుత్యువుతో పోరాడిన పరాగ్, ఈ నెల ఏడో తేదీన తుది శ్వాస విడిచాడు. వరుస బాంబు పేలుళ్లకు శనివారంతో తొమ్మిది ఏళ్లు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరే ప్రమాదం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసు శాఖ ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమైంది.