ప్రజలు తప్ప మరెవరూ ‘బ్యాన్’ చేయలేరు
* కళాకారుల సంఘానికి లేఖ రాస్తామన్న నిర్మాతల మండలి
* ప్రజలు తప్ప మరెవరూ తనను ‘బ్యాన్’ చేయలేరన్న దునియా విజయ్
బెంగళూరు : శాండల్‌వుడ్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నటుడు దునియా విజయ్‌పై ‘నిషేధం’ విధించాలని నిర్మాతల మండలి కోరుతుంటే.. ప్రజలు తప్ప మరెవరూ తనపై ‘నిషేధాన్ని’ విధించలేరని దునియా విజయ్ చెబుతున్నారు. ఇక ఈ వివాదానికి దారి తీసిన అంశాలను పరిశీలిస్తే... ఈనెల 1న మేడే సందర్భాన్ని పురస్కరించుకొని సినీ రంగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దునియా విజయ్ మాట్లాడుతూ....‘సినీ రంగ కార్మికులు, సినిమా రంగంలోని మహిళలపై దౌర్జన్యాలకు నిర్మాతలను ఊరికే వదిలేది లేదు. అలాంటి వారిని కిరోసిన్ పోసి తగలబెట్టినా తప్పులేదు’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దునియా విజయ్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న నిర్మాతలు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. నిర్మాతలను అగౌరవ పరిచేలా దునియా విజయ్ వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని నిర్మాతల మండలి అధ్యక్షుడు మునిరత్న ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
సినీ రంగానికి మూలస్తంభం లాంటి వాడైన నిర్మాతల పట్ల దురుసుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఈ విషయమై నిర్మాతలకు దునియా విజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లే ని పక్షంలో అతనిపై నిషేధం విధించాల్సిందిగా కళాకారుల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. కాగా, తన నివాసంలో తనను కలిసిన విలేకరులతో దునియా విజయ్ మాట్లాడుతూ...కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరించే నిర్మాతల గురించి తాను ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప నిర్మాతలందరినీ అనలేదని అన్నారు.
అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను రౌడీ అంటూ కొందరు నిర్మాతలు పేర్కొనడం సరికాదని అన్నారు. తనపై ఎవరూ నిషేధాన్ని విధించలేరని, కేవలం ప్రజలకు మాత్రమే తనను నిషేధించగల శక్తి సామర్థ్యాలున్నాయని అన్నారు. ఎక్కడో నాలుగు గోడల మధ్య కాకుండా తన ఎదురుగా వచ్చి మాట్లాడితే అన్ని విషయాలపై వివరణ ఇస్తానని దునియా విజయ్ పేర్కొన్నారు.