ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నారు.
సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్‌కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.
బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment