అవినీతిపై రాజీలేదు
Published Sun, Jan 5 2014 10:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ:అవినీతిపై చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. మేం అధికారంలోకి వచ్చి ఇంకా 8 రోజులే అయ్యింది. అవినీతిపరులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది..’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. మరి మీరు ఆ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణలను పక్కన పెట్టేసే అవకాశం ఉందా..’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ..‘అవినీతిపై యుద్ధం చేస్తామని ప్రజలకు చెప్పి మేం అధికారంలోకి వచ్చాం.
ఆ విషయంలో నా ప్రాణం పోయినా వెనుకడుగు వేసేది లేదు..’ అని ఆయన స్పష్టం చేశారు. ‘ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అయినా, మరే ఇతర మంత్రులైనా, బీజేపీ నాయకులు..ఆఖరికి మా పార్టీ వారైనా సరే అవినీతి ఆరోపణలు వస్తే విడిచిపెట్టే ప్రశ్నేలేదు..’ అని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఆరోపణలపై చర్యలు తీసుకునేముందు సరైన కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా అవసరమన్నారు. ఉదాహరణకు ‘అవినీతికి వ్యతిరేకంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఇస్తామని మా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానిని ప్రారంభించేందుకు మేం వారం రోజుల నుంచి కసరత్తు చేయాల్సి వస్తోంది..’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
అసంఘటిత కూలీల సంక్షేమానికి పథకాలు: కార్మిక మంత్రి గిరీష్
అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పథకాల అమలుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నడుం బిగించింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన 18 హామీల్లో ఒకటైన అసంఘటిత కార్మికుల సంక్షేమానికి తగిన పథకాలను రూపొందించనుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2002, సెప్టెంబర్ 2న ఏర్పాటుచేసిన ఢిల్లీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వద్ద నిరుపయోగంగా మిగిలిపోయిన సుమారు రూ.1,200 కోట్లను కొత్త పథకాల కింద సద్వినియోగం చేసుకోవాలని నూతన కార్మిక మంత్రి గిరీష్ సోనీ యోచిస్తున్నారు. ‘నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి చాలా దారుణం. వారిలో ఎక్కువమంది వేరే ప్రాంతాలనుంచి కడుపు చేత పట్టుకుని పొట్టికూటి కోసం వలసలు వచ్చినవారే. ఎక్కువ మంది నిరక్షరాస్యులు.. హక్కులపై వారికి ఎటువంటి అవగాహన ఉండదు.
వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి’ అని గిరీష్ సోనీ అన్నారు. వారికి సాంఘిక భద్రత కల్పించడం మా ప్రభుత్వం బాధ్యత అని మంత్రి చెప్పారు. భవన కార్మికుల వేతనాలను, పనిగంటలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల కార్మిక శాఖ కమిషనర్‌తో భేటీ అయ్యారు. కాగా, బోర్డు 2013 నవంబర్ 11 వరకు పన్ను కింద కార్మికుల నుంచి వసూలు చేసింది రూ.1,256 కోట్లు కాగా, సంక్షేమ కార్యక్రమాల కింద ఖర్చు చేసింది కేవలం రూ.37.41 కోట్లేనని మంత్రి వివరించారు.
అన్ని శాఖల్లో కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని ‘ఆప్’ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలను కేజ్రీవాల్ ప్రభుత్వం తెప్పించుకుంటోంది. ‘ఎంతోకాలంగా ఒకే శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వివరాలను తెప్పించుకుంటున్నాం. పూర్తి వివరాలు అందిన తర్వాత వారి సర్వీసు క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుంటాం..’ అని మంత్రి సోనీ వివరించారు. అధికారిక సమాచారం మేరకు విద్యుత్ సరఫరా కంపెనీలలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని కార్మిక మంత్రి గిరీష్ సోనీని కలిసి ఢిల్లీ ఎలక్ట్రిక్ సప్లయి అండర్‌టేకింగ్ మజ్దూర్ సంఘ్(కార్మిక సంఘం) ప్రధాన కార్యదర్శి బల్బీర్ సింగ్ డిమాండ్ చేశారు.
ఆప్ అధికారం యాదృచ్ఛికం: శరద్ పవార్
ముంబై: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అదృష్టం కొద్దీ విజయం వరించిందని ృేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఆప్ విజయ చూసి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రఫుల్ల కుమార్ మహంతా తన చిన్న వయసులోనే అస్సాంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. తర్వాత పాతికేళ్లుగా అతడి గురించి ఏమాత్రం వినిపించడం లేదు. ఢిల్లీ వంటి ఫలితాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అలాంటి వాటిని పట్టించుకుంటే భవిష్యత్తువైపు చూడలేం. కాబట్టి ఎటువంటి అనుమానాలు మనసులో పెట్టుకోకుండా ముందడుగు వేయండి’ అని కార్యకర్తలకు నూరిపోశారు. ఢిల్లీ ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలు వేర్వేరని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement